పదవులకు వన్నె తెచ్చే పనులు చేయండి
● మూడో విడత ఎన్నికల్లో మనోళ్లకు సాయం చేయండి ● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: గ్రామాల్లో సర్పంచ్ పదవీ ఎంతో కీలకమైందని, పదవులకు వన్నె తెచ్చేలా పనులు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు సూచించారు. జిల్లాలో తొలి, మలి విడతల్లో సర్పంచులుగా ఎన్నికై న బీఆర్‌ఎస్ మద్దతుదారులను సిరిసిల్ల తెలంగాణభవన్‌లో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశం స్థాయిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఉంటారని, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా స్థాయిలో జెడ్పీ, మండల స్థాయిలో మండల పరిషత్, గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఉంటాయని వివరించారు. ఎంపీటీసీ సభ్యులు గ్రామానికి, మండలానికి సంధానకర్తలని, జెడ్పీటీసీ సభ్యులు మండలానికి జెడ్పీకి సంధానకర్తలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం మనం పన్నుల రూపంలో కట్టే డబ్బులను ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామాలకు 70 శాతం నిధులు వస్తాయని, మండల పరిషత్‌లకు 20 శాతం, జెడ్పీలకు 10 శాతం నిధులు వస్తాయని వివరించారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని కేటీఆర్ వివరించారు. రిటైర్డు డీపీవోలతోపాటు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉన్న వ్యక్తులతో వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో మన బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచే విధంగా చూడాలన్నారు. మీ బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి మనోళ్లు గెలిచేలా అండగా నిలవాలని కోరారు. వేములవాడ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ వేములవాడ ప్రాంతంలో అక్కడి ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ వాళ్లను బెదిరింపుకు గురిచేసినా.. ప్రజలు మనోళ్లకే ఓట్లు వేసి గెలిపించారన్నారు. వీరసైనికుల్లా ఎన్నికల్లో పని చేసి గెలిచిన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పల్లెలు ఎంత అభివృద్ధి సాధించాయో మీ కళ్ల ముందే ఉందన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని వివరించారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన కోరారు. జిల్లాలో బీఆర్‌ఎస్ మద్ధతుదారులైన సర్పంచ్‌లను ఈ సందర్భంగా సన్మానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమా, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ‘సెస్’ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, పార్టీ నాయకులు గోక బాపురెడ్డి, సిద్దం వేణు, ఏనుగు మనోహర్‌రెడ్డి, గజభీంకార్ రాజన్న, మల్యాల దేవయ్య, రాఘవరెడ్డి పాల్గొన్నారు.


