పెద్దపులి వచ్చింది.. అప్రమత్తంగా ఉండండి
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వచ్చిందని.. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీవో కిరణ్ కోరారు. జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వచ్చిందన్న సమాచారం నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు వీర్నపల్లి, గంభీరావుపేట, గొల్లపల్లి సెక్షన్ల పరిధిలోని గ్రామాల్లో సోమవారం అవగాహన కల్పించారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. అటవీ ప్రాంతంలోకి పశువులను పంపొద్దన్నారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీహరిప్రసాద్, వీర్నపల్లి, గొల్లపల్లి అటవీ సెక్షన్ అధికారులు రంజిత్‌కుమార్, సకారాం, బీట్ అధికారులు శ్రీకాంత్, తిరుపతినాయక్, రజిత, కిరణ్ పాల్గొన్నారు.


