పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఖతం
● కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఖతమవుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రెండు విడతల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని, మూడోవిడతలోనైనా గౌరవప్రదంగా గెలవాలని కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని ఎద్దేవా చేశారు. జిల్లాలో 83 మంది గెలిచినట్లు కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 60 దగ్గరే బీఆర్‌ఎస్ ఆగిపోయిందన్నారు. ఎన్నికల్లో గెలువలేక తప్పుడు లెక్కలతో పరువు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తున్నారన్నారు. మీ సొంత చెల్లి కవిత కామెంట్స్‌కే సమాధానం చెప్పుకోలేకపోతున్నావని ఎద్దేవా చేశారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సొంతూరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారని గుర్తు చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, పార్టీ నాయకులు గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య పాల్గొన్నారు.


