గంభీరావుపేట ‘సెస్’ డైరెక్టర్ ఎన్నిక చెల్లదు
● సహకార ట్రిబ్యునల్ ఆదేశాలు ● మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం
సిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) గంభీరావుపేట డైరెక్టర్ గౌరినేని నారాయణరావు ఎన్నిక చెల్లదంటూ సహకార ట్రిబ్యునల్ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్డర్ కాపీలను ‘సెస్’ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్‌యాదవ్ సోమవారం సిరిసిల్లలో విలేకరులకు అందించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం... సెస్ సంస్థలోని 15 డైరెక్టర్ స్థానాలకు 2022 డిసెంబరులో ఎన్నికలు నిర్వహించారు. గంభీరావుపేట డైరెక్టర్‌గా గౌరినేని నారాయణరావు గెలిచినట్లు అప్పటి ఎన్నికల అధికారి ప్రకటించారు. దీన్ని సవాల్ చేస్తూ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్‌యాదవ్ సహకార శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రలతో ఎన్నికల ఫలితాలు తారుమారు చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మద్దతుదారుడు గౌరీనేని నారాయణరావు గెలిచినట్టు 2022 డిసెంబరు 26న ఎన్నికల అధికారి ప్రకటించడాన్ని సవాల చేస్తూ వరంగల్‌లోని కో–ఆపరేటీవ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. సాక్ష్యాలు పరిశీలించిన సహకారశాఖ ట్రిబ్యునల్ ఆ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ విషయమై ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావును ‘సాక్షి’ వివరణ కోరగా సహకార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


