పల్లెపోరులో కాంగ్రెస్ హవా
● రెండో విడతలో 77 జీపీలకు ఎన్నికలు ● 40 స్థానాల్లో సత్తాచాటిన హస్తం పార్టీ ● తంగళ్లపల్లిలో బీఆర్‌ఎస్ జోరు
సిరిసిల్ల: రెండో విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. జిల్లాలోని బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని 77 గ్రామపంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల సమయంలోనే 11 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 30 గ్రామాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 6 గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు, 12 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని తంగళ్లపల్లి మండలంలో గులాబీ పార్టీ పట్టు నిలుపుకుంది. మండల వ్యాప్తంగా 30 గ్రామాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 15 మంది విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడుగురు, బీజేపీ అభ్యర్థులు నలుగురు, ఇతరులు నలుగురు గెలుపొందారు. బోయినపల్లి మండల వ్యాప్తంగా 23 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ 13 గ్రామాలను హస్తగతం చేసుకోగా, ఆరు గ్రామాల్లో బీఆర్‌ఎస్, ఒక చోట బీజేపీ, ఇతరులు మూడు గ్రామాల్లో గెలుపొందారు. ఇల్లంతకుంట మండలంలోని 35 గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన 20 మంది విజయం సాధించగా, 9 గ్రామాల్లో బీఆర్‌ఎస్, ఒక స్థానాన్ని బీజేపీ కై వసం చేసుకోగా, ఐదు గ్రామాల్లో ఇతరులు విజయం సాధించారు.
పల్లె ఓటరు చైతన్యం
మొదటి విడతకంటే రెండో విడతలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 77 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు, 530 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 84.41 శాతం పోలింగ్ నమోదైంది. యాసంగి(రబీ) సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు, మహిళలు పొద్దున్నే ఓటేసి పనులకు వెళ్లడం కనిపించింది.
క్షేత్రస్థాయిలో పోలింగ్ పరిశీలన
బోయినపల్లి మండలం నీలోజిపల్లి, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. నీలోజిపల్లిలో వేములవాడ ఆర్డీవో రాధాబాయి, సీపీవో శ్రీనివాసాచార్యులు, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల ఉండగా.. తంగళ్లపల్లిలో అదనపు కలెక్టర్ నగేశ్, తహసీల్దార్ జయంత్‌కుమార్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ ఎంపీవోలు ఉన్నారు.
ఇల్లంతకుంటలో అధిక పోలింగ్
మూడు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
మహిళా ఓటర్లే అధికం
మూడు మండలాల్లో మొత్తం ఓటర్లు 1,04,905 మంది ఉండగా మహిళా ఓటర్లు 54,131, పురుషులు 50,773 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,358 మంది అధికంగా ఉన్నారు. పురుషులు 42,023 మంది ఓటుహక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం 82.77 నమోదు చేయగా.. మహిళలు 46,529 మంది ఓటుహక్కును వినియోగించుకుని 85.96 శాతం నమోదు చేశారు. మహిళా ఓటర్లలో చైతన్యం కనిపించింది.
పటిష్ట పోలీసు భద్రత
పోలింగ్‌కు పటిష్టమైన పోలీస్ భద్రతను ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి పర్యవేక్షణలో సాగింది. 722 మందితో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టడి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు పోలీసులు భద్రత చర్యలు పర్యవేక్షించారు.
పార్టీల వారీగా ఫలితాలు
కాంగ్రెస్ 40
బీఆర్‌ఎస్ 30
బీజేపీ 06
ఇతరులు 12
పల్లెపోరులో కాంగ్రెస్ హవా


