పల్లెపోరు ‘ప్రత్యక్షం’
● పంచాయతీ ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్ ● 195 పల్లె ఎన్నికలపై నిఘా నేత్రం ● కలెక్టరేట్‌లో పోలింగ్ కేంద్రాలు ప్రత్యక్షం
సిరిసిల్ల/బోయినపల్లి/ఇల్లంతకుంట: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెబ్‌కాస్టింగ్ విధానాన్ని అమలు చేశారు. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులు నేరుగా పల్లెల్లో జరిగే ఎన్నికల పర్వాన్ని ప్రత్యక్షంగా చూశారు. జిల్లాలోని బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 77 గ్రామాల్లో 530 వార్డుల్లో ఆదివారం ఎన్నికలు జరగ్గా.. 195 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కలెక్టరేట్ నుంచి వెబ్‌కాస్టింగ్‌ను పరిశీలించారు. ఎన్నికల సంఘం సూచన మేరకు జిల్లాలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. పల్లెల్లో జరిగే ఎన్నికలను లైవ్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తూ ఆన్‌లైన్‌లో జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి రాష్ట్ర రాజధానికి అనుసంధానించారు. డీపీవో షరీఫొ ద్దీన్, ఈడీఎం శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
లెక్కింపు కేంద్రాల పరిశీలన
ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. రెండో విడత ఎన్నికలు జరిగిన ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు వల్లంపట్ల, తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, తహసీల్దార్‌లు జయంత్, నారాయణరెడ్డి, ఎంపీడీవోలు శశికళ, లక్ష్మీనారాయణ, జయశీల ఉన్నారు.


