ఆరోగ్య పరీక్షలు తూచ్!
అసలు జరుగుతోంది ఇదీ..
మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్‌లో నిర్వహించిన భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల హెల్త్‌క్యాంప్. ఇక్కడ నిర్మాణ, అనుబంధ రంగానికి చెందిన కార్మికులు కాకుండా పవర్‌లూమ్ వర్కర్ నుంచి రక్తనమూనా సేకరిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అడిగే వారు లేరని ఇష్టారీతిగా ఈ సంస్థ ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు.
మీరు చూస్తున్న ఈ ఫొటో ముస్తాబాద్ మండలం దేశాయిపల్లి. భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షలు చేసే బాధ్యతలను ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చి ఓ కార్మికుడి నుంచి బ్లడ్ శాంపిల్ సేకరిస్తున్నారు. ఈ శాంపిల్ సేకరించే వ్యక్తి సాధారణ వ్యక్తి కావడం గమనార్హం.
సిరిసిల్లటౌన్: భవన నిర్మాణరంగ కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అభాసుపాలవుతోంది. కోట్లు వెచ్చించి చేపట్టిన ఈ హెల్త్ ప్రోగ్రామ్ భవన నిర్మాణరంగ కార్మికులకు ఉపయోగపడడం లేదు. ఆ కాంట్రాక్ట్ పొందిన ప్రైవేట్ సంస్థ జేబులు నింపేలా మారింది. అర్హత లేని వ్యక్తులు బ్లడ్‌శాంపిల్స్ సేకరించడం, భవన నిర్మాణ రంగానికి చెందిన వారి నుంచే కాకుండా ఇతరుల శాంపిల్స్ సేకరిస్తుండడం గమనార్హం. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సాగుతున్న కార్మిక ఆరోగ్య నిర్ధారణపై ప్రత్యేక కథనం.
ప్రభుత్వ లక్ష్యమిదీ..
భవన నిర్మాణం, ఇతర కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేసే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ ప్రైవేట్ హెల్త్‌కేర్ సంస్థ కేంద్రం నుంచి అనుమతులు పొందింది. ఈ సంస్థ మూడేళ్లుగా తెలంగాణలోని కార్మికుల ఆరోగ్య పరీక్షలు చేస్తుంది. సంస్థకు చెందిన వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా టెస్టులు చేస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో 12 బృందాలు
నిజామాబాద్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు డివిజనల్ మేనేజర్‌గా వ్యవహరించే వ్యక్తి పెద్దపల్లిలో ఉంటున్నట్లు సమాచారం. రాజన్నసిరిసిల్ల జిల్లాలో కార్మికుల ఆరోగ్య పరీక్షలు చేసేందుకు 12 బృందాలను ఏర్పాటు చేశాారు. ఒక్కో టీమ్‌లో ఇద్దరు ఉంటారు. వీరిలో ఒకరు రిజిస్ట్రేషన్ పర్సన్(డిగ్రీ అర్హత), ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్‌టీ సర్టిఫికెట్) గల వ్యక్తి ఉంటారు. ఒక్కో టీమ్ రోజుకు పది మంది కార్మికులకు పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
52 రకాల పరీక్షలు
కార్మికుల ఆరోగ్య పరీక్షలు చేసేందుకు కార్మికుల వెల్ఫేర్‌బోర్డు నిధులను కేటాయించారు. ఒక్కో కార్మికుడికి పరీక్ష చేసినందుకు రూ.3,250 ప్రభుత్వం సదరు సంస్థకు చెల్లిస్తుంది. కార్మికుడి బరువు, ఎత్తు, బీపీ, షుగర్, కంటి విజన్, వినికిడి, ఈసీజీ, పీఎఫ్‌టీ, సీబీపీ, బ్లడ్‌గ్రూప్, లివర్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, కిడ్నీప్రొఫైల్ తదితర 52 రకాల పరీక్షలు నిర్వహించాలి. భవన, ఇతర నిర్మాణ రంగాల లేబర్‌కార్డు ఉన్న కార్మికులకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 35వేల మందికి టెస్టులు చేశారు. అంటే దాదాపు రూ. 11.37కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఆరోగ్య పరీక్షల నిర్వహణపై ఆరోగ్య, కార్మికశాఖలతోపాటు ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేదు.
భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులకు ఉచితంగా టెస్టులు నిర్వహించే సంస్థ ప్రతినిధులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గ్రామాలు, పట్టణాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. ఎంబీబీఎస్ వైద్యుడి పర్యవేక్షణలో పరీక్షలు చేయాలి.
సంస్థ సిబ్బంది ఎలాంటి మిషనరీ, సామగ్రి లేకుండా కార్మికుల రక్త, మూత్రం శాంపిళ్లను సేకరిస్తున్నారు.
సేకరించిన శాంపిళ్లను కరీంనగర్‌లోని సంస్థ కు చెందిన ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నట్లు చె బుతున్నారు. అక్కడి నుంచే శాంపిల్స్ ఇచ్చిన కార్మికులకు రిపోర్టులు పంపిస్తున్నారు.
నిర్మాణ కార్మికుల ధ్రువీకరణకార్డులు లేని వారికి కూడా పరీక్షలు చేస్తున్నట్లు కార్మికసంఘాలు చెబుతున్నాయి. మరోవైపు రోడ్ల వెంట వెళ్లే వారి శాంపిళ్లను సైతం సేకరిస్తున్నట్లు సమాచారం.
సేకరించిన ఒక్కో శాంపిల్‌కు కార్మికుడి వివరాలు, సెల్‌ఫోన్ నంబరు, లేబర్‌కార్డు వివరాలు పొందుపర్చాలి. కానీ ఆ సంస్థ సిబ్బంది ఆ వివరాలు సేకరించడం లేదు.
ఒకరి శాంపిళ్లను ఇద్దరు కార్మికుల వద్ద సేకరించినట్లుగా ల్యాబ్‌కు పంపిస్తూ.. తమ టార్గెట్‌ను పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆరోగ్య పరీక్షలు తూచ్!


