పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● 700 మందితో బందోబస్తు
తంగళ్లపల్లి/బోయినపల్లి: ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను, బోయినపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం సందర్శించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సి బ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ 26 రూట్ మొబైల్స్, ఏడు జోనల్ టీమ్స్, మూడు క్విక్ రియాక్షన్ టీమ్స్, రెండు స్ట్రైకింగ్‌ఫోర్స్‌తో 700 మంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య ఉన్నారు.
పలువురిపై కేసులు, నగదు సీజ్
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో 9 కేసులు నమోదు చేసి, రూ.23,28,500 నగదు సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 93 కేసుల్లో 1,387 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. ఎన్నికలకు భంగం కలిగించే అవకాశం ఉన్న 782 మందిని గుర్తించి బైండోవర్ చేసినట్లు తెలిపారు.
సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
బోయినపల్లి మండలంలోని తడగొండ, కోరెం, విలాసాగర్, స్తంభంపల్లి, నీలోజిపల్లి, కొదురుపాక ఆరు గ్రామాల్లో సమస్మాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రత ఉంటుందని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 12 మంది ఎస్సైలు, 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్సై ఎన్.రమాకాంత్ తదితరులు ఉన్నారు.


