ఆ రేషన్‌షాపులు రద్దు
14 నెలల తర్వాత కోర్టు ఆదేశాలు
అయోమయంలో కొత్త డీలర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌లో 2024 సెప్టెంబరులో నియమించిన రేషన్‌డీలర్ల ఎంపికను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ నోటిఫికేషన్ జారీచేసి పారదర్శకంగా ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రేషన్‌డీలర్లుగా ఎంపికై పనిచేస్తున్న వారు అయోమయానికి గురవుతున్నారు. కోర్టు ఆదేశాలను రద్దు చేయించేందుకు మళ్లీ అప్పీలుకు వెళ్లాలని భావిస్తున్నారు.
ఏం జరిగిందంటే ?
సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన 58 రేషన్‌దుకాణాల డీలర్ల భర్తీకి 2024 ఆగస్టు 29న అప్పటి ఆర్డీవో ఎల్.రమేశ్ నోటిఫికేషన్ జారీ చేశారు. 52 రేషన్‌షాపులకు 830 మంది దరఖాస్తు చేశారు. ఆరు దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. సెప్టెంబరు 15న నిర్వహించిన రాతపరీక్షలకు 765 మంది హాజరయ్యారు. ఒక్కో రేషన్ షాపునకు అర్హత సాధించిన ఐదుగురిని మౌఖిక ఇంటర్వ్యూలకు పిలిచారు. కానీ పరీక్షల్లో మెరిట్ జాబితాను అధికారులు వెల్లడించలేదు. కేవలం ఎంపికై న అభ్యర్థులను ఇంటర్వ్యూలకు రావాల్సిందిగా సమాచారం అందించారు.
ఇవీ రేషన్‌షాపుల ఖాళీలు
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఆరెపల్లి, గొల్లపల్లి, పత్తికుంటపల్లి, గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, లక్ష్మీపూర్, రాజుపేట, ఒడ్డెరకాలనీ, గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు షాపులు, ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు పోతుగల్‌లో రెండు, గూడూరు, నామాపూర్, సేవాలాల్‌తండా, వెంకట్రావుపల్లె, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 11 రేషన్ షాపులు, రగుడు, సర్ధాపూర్, ముష్టిపల్లి, చిన్నబోనాల, చంద్రంపేట, పెద్దూరు, తంగళ్లపల్లి మండల కేంద్రంతోపాటు నేరెళ్ల, చిన్నలింగాపూర్, పద్మనగర్, ఇందిరానగర్, గండిలచ్చపేట, వేణుగోపాల్‌పూర్, కేసీఆర్ నగర్, దేశాయిపల్లి, ఇందిరానగర్(జిల్లెల్ల), బాలమల్లుపల్లె, పాపయ్యపల్లె, చీర్లవంచ, ఇందిరమ్మకాలనీ, నర్సింహులపల్లి, వీర్నపల్లి మండల కేంద్రం, గర్జనపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్‌పూర్, తిమ్మాపూర్, బొప్పాపూర్, హరిదాస్‌నగర్, దుమాల, రాగట్లపల్లి, పోతిరెడ్డిపల్లె గ్రామాల్లో రేషన్ డీలర్ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రకటించారు.
నిబంధనలు గాలికి..
రేషన్‌షాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని, పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల స్థానికులు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అనర్హులని వెల్లడించారు. కానీ నిబంధనలను గాలికి వదిలేస్తూ రేషన్ డీలర్ల నియామకాలు పూర్తయ్యాయి. అధికార పార్టీ నేతల సిపార్సుల పేరిట మరోవైపు వసూళ్లపర్వం సాగినట్లు సమాచారం. రేషన్‌షాపుల కేటాయింపుల్లో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆయా షాపులకు ఉన్న డిమాండ్‌ను బట్టీ ఆ పార్టీ ముఖ్యనాయకులు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ అధికారులు సైతం ఇదే అదనుగా సిపార్సుతోపాటు డబ్బులు వస్తున్నాయనే ధీమాతో ఇంటర్వ్యూల తర్వాత ఎంపిక అభ్యర్థుల జాబితాను వెల్లడించకుండా.. రాత్రి వేళల్లో డీలర్లకు నియామక పత్రాలను అందించారు. సిరిసిల్ల డివిజన్‌లో జరిగిన రేషన్ డీలర్ల అక్రమాలపై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ వితంతు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టును ఆశ్రయించిన బాధితులు
రేషన్‌డీలర్ల ఎంపికలో జరిగిన అక్రమాలపై బాధితులు కొందరు కోర్టును ఆశ్రయించారు. పారదర్శకంగా నియామకాలు జరగలేదని, నిబంధనలను పాటించలేంటూ కోర్టుకు వెళ్లారు. వాదోపవాదనలు విన్న కోర్టు 14 నెలల తరువాత 44 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ఆ నియామకాలు చెల్లవని, రేషన్ డీలర్ల ఎంపికకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. దీనిపై అప్పీలుకు వెళ్లాలని రేషన్ డీలర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా.. సిరిసిల్ల ప్రాంతంలో కొత్త రేషన్ డీలర్ల నియామకాల రద్దు చర్చనీయాంశమైంది.


