‘ట్రినిటి’కి జాతీయస్థాయి అవార్డు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీ(అటానమస్)కు జాతీయస్థాయి ఫ్యూచర్ రెడీ ఇనిస్టిట్యూషన్ అవార్డు – 2025ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. బ్రెయిన్ ఫీడ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి వేదికపై ఉన్నత విద్యామండలి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ బాలకృష్ణరెడ్డి ద్వారా విద్యాసంస్థ ప్రతినిధులు అవార్డు అందుకున్నారు. జిల్లాలో వ్యాప్తంగా తమ కాలేజీకే అవార్డు దక్కడం సంతోషకరమని ట్రినిటి ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్ మమతారెడ్డి, కో ఆర్డినేటర్ అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ మణిగణేశన్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.
సర్పంచ్ అభ్యర్థి కళ్లలో కారం చల్లి దాడి
శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామపంచాయతీ అభ్యర్థి దండు కొమురయ్య కళ్లలో కారం చల్లి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ మద్దతుతో పోటీచేస్తున్న కొమురయ్య శుక్రవారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న క్రమంలో ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కళ్లలో కారంపొడి చల్లి దాడి చేసి పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. సృహతప్పి పడిపోయి తేరుకున్న తర్వాత 100కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌కుమార్ ఫోన్‌లో మాట్లాడారు.


