ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
సిరిసిల్ల: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సాయంత్రం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌హెచ్‌ఓలతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని, గ్రామంలో ఓటు లేని వ్యక్తి ఉండకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల పీవోకు తప్ప ఎవరికీ మొబైల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎస్పీ మహేశ్ బీ గితే మాట్లాడుతూ, ఎక్కడైనా సమస్యలు ఉంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, జిల్లా ఎన్నికల వ్యయ, సాధారణ పరిశీలకులు రాజ్‌కుమార్, రవికుమార్, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం, డీపీవో షరీషోద్దీన్, నవీన్, భారతి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమీక్షించారు.
సకాలంలో పన్ను వసూలు చేయండి
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇంటి పన్ను సకాలంలో వసూలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఇంటి, నీటి పన్ను వసూలు, ట్రేడ్ లైసెన్స్, తడి, పొడి చెత్త సేకరణ తదితర అంశాలపై మంగళవారం సమీక్షించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్‌ను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఏసీబీ సీఐ పున్నం చందర్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, పర్యవేక్షకులు శ్రావణ్ పాల్గొన్నారు.


