ప్రలోభాల పర్వం!
ఎన్నికల సిబ్బంది వివరాలు
మొదటి విడత ఎన్నికలకు నేటితో ప్రచారం బంద్
నేడు మూడో విడతకు నామినేషన్ల ఉపసంహరణ
ఐదు మండలాల్లో ఎల్లుండి ఎన్నికలు
బ్యాలెట్‌బాక్స్‌లు సిద్ధం చేస్తున్న అధికారులు
రెండో విడత గ్రామాల్లో ప్రచారం ముమ్మరం
సిరిసిల్ల: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. తొలి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి విడతలో ఎన్నికలు జరిగే వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. అధికారులు బ్యాలెట్ బ్యాక్స్‌లు, పత్రాలను సిద్ధం చేస్తున్నారు. 11న ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసు బలగాలు సిద్ధమయ్యాయి.
76 గ్రామాల్లో ఎన్నికలు
వేములవాడ నియోజకవర్గంలోని 85 గ్రామాలు.. 748 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రుద్రంగి మండలంలోని ఏడు, కోనరావుపేట మండలంలోని రెండు గ్రామాలు ఏకగీవ్రమైన విషయం తెలిసిందే.
నేటితో ప్రచారం బంద్
తొలివిడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ఆపేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాల పర్వం మొదలుకానుంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా మందు పంపిణీ, డబ్బుల పంపిణీకి సిద్ధం చేసుకున్నారు. మహిళా సంఘాలను ఆకట్టుకునేందుకు, యువకుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రెండో విడత ప్రచార జోరు
రెండోవిడతలో ఈనెల 14న ఎన్నికలు జరిగే బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. తమకు వచ్చిన గుర్తులను ప్రజలకు వివరిస్తున్నారు. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థులు పేర్లు ఉండకపోవడంలో నమూనా బ్యాలెట్‌తో ప్రచారం చేస్తున్నారు. కులసంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలను కూడగడుతున్నారు.
నేడు మూడోవిడత నామినేషన్ల ఉపసంహరణ
మూడో విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. సాయంత్రం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ద్విముఖ పోటీ ఉన్న స్థానాల్లో బుజ్జగింపుల పర్వం సాగుతోంది.
పకడ్బందీగా బందోబస్తు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసులు పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా బందోబస్తు చేపడుతున్నారు.
మండలం పీవోలు ఓపీవోలు
చందుర్తి 209 259
కోనరావుపేట 286 360
రుద్రంగి 103 143
వేములవాడ అర్బన్ 125 179
వేములవాడ రూరల్ 175 196


