ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ భార్యకు ప్రసవం
కోల్‌సిటీ(రామగుండం): ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం పెంచుతూ.. అదే ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించిన సర్కారు వైద్యుడు దండె రాజు ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఇన్‌చార్జి ఆర్‌ఎంవో, ఆర్థోపెడిక్ సర్జన్, సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా దండె రాజు విధులు నిర్వహిస్తున్నారు. నెలలు నిండిన తన భార్య శివాణికి డెలివరీ చేయించడానికి తను పనిచేస్తున్న జీజీహెచ్‌లో బుధవారం అడ్మిట్ చేయించారు. సిజేరియన్ ద్వారా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో ఆస్పత్రి వాతావరణం ఆనందంతో నిండిపోయింది. ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా డాక్టర్ రాజు తన భార్యకు సర్కారు ఆస్పత్రిలోనే డెలివరీ చేయిండం ఆదర్శంగా నిలిచిందని వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజును గైనిక్, పీడియాట్రిక్, సర్జికల్, అనస్థీషియా తదితర విభాగాల ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు అభినందించారు.


