అభ్యర్థి స్థానికులై ఉండాలి
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసే వ్యక్తి ఆ గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల మొదటిదశ నామినేషన్లు గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు పరిశీలిద్దాం.
● నామినేషన్ వేసేవారు కొత్తగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. నామినేషన్ వేసే రోజు న్యూ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ జతపరచాలి.
● రోజు వారి ఖర్చు లెక్కలు ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే నిర్వహించాలి.
● కులం సర్టిఫికెట్ ఇది వరకు ఉంటే సరిపోతుంది. లేకపోతే కొత్తగా సర్టిఫికెట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీలు) తీసుకోవాలి.
● నామినేషన్ వేసే వ్యక్తికి 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి.
● అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.
● ప్రతిపాదకుడు కచ్చితంగా సంబంధిత వార్డు ఓటర్ లిస్టులో నమోదై ఉండాలి.
● పోటీ చేసే అభ్యర్థి, ప్రతిపాదకుడు ఇంటి పన్నులు చెల్లించి, గ్రామపంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాలి.
● ఎన్నికల్లో పోటీకి సర్పంచ్ అభ్యర్థి రూ.2వేల డిపాజిట్ రుసుం చెల్లించాలి. వార్డు సభ్యుడు అభ్యర్థి రూ.500 డిపాజిట్ చెల్లించాలి.
● ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రాలను తప్పనిసరిగా ఇవ్వాలి. లేకుంటే.. నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో డిప్యూటీ తహసీల్దార్‌తో సంతకం చేయించాలి.
● రిజర్వుడు కేటగిరీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎన్నికల నామినేషన్ డిపాజిట్ సర్పంచ్ అభ్యర్థి రూ.వెయ్యి, వార్డు సభ్యుడి అభ్యర్థి రూ.250 చెల్లించాలి.
● ఇద్దరు సాక్షుల స్వీయ ధ్రువీకరణతో అన్ని గడులు పూరించి ఇవ్వాలి.
● రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్‌పై సంతకం చేయాలి.
● పోటీ చేసే అభ్యర్థులు తన గుర్తింపుకార్డు కోసం ఫొటోను ఇవ్వాలి.
● స్క్రుటీని రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా హాజరుకావాలి.
అవసరమైన పత్రాలు ఇవీ..
● ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు.. కుల ధ్రువీకరణపత్రాలను జతచేయాలి.
● డిపాజిట్ సొమ్ము చెల్లించాలి.
● నేరచరిత్ర, స్థిర, చర ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిట్, ఇద్దరు సాక్ష్యాలతో సంతకాలు పెట్టించి ఇవ్వాలి.
● ఎన్నికల ఖర్చుల వివరాలను నమోదు చేసి ఇస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి.
● అఫిడవిట్‌లో ఇద్దరు సాక్ష్యుల సంతకం, అభ్యర్థి సంతకం తప్పనిసరిగా ఉండాలి.
● ఎన్నికల వ్యయ డిక్లరేషన్‌లో అభ్యర్థి సంతకం ఉండాలి.
● గ్రామపంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్
● బ్యాంకు అకౌంట్ జిరాక్స్ పత్రం ఇవ్వాలి.
కొత్త బ్యాంకు ఖాతాను తీసుకోవాలి
21 ఏళ్లు నిండిన వారే పోటీకి అర్హులు


