ఫుట్‌బాల్ ఆడుతూ.. అనంతలోకాలకు..
పెద్దపల్లిరూరల్: తను చదువుకునే పాఠశాలలో సహచర విద్యార్థులతో కలిసి సంతోషంగా ఫుట్‌బాల్ ఆడుతూ కిందపడిపోయిన కొద్దిగంటల్లోనే మృతి చెందిన విషాద సంఘటన పెద్దపల్లి శివారు రంగంపల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి శివారు రంగంపల్లిలో నివాసముంటున్న కుమారస్వామి–సునీత దంపతుల కుమారుడు కనవేన ప్రతీక్(15) రంగంపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. లంచ్‌టైంలో సహచర విద్యార్థులతో కలిసి మంగళవారం ఫుట్‌బాల్ ఆడుతుండగా కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తల్లి సునీత వచ్చి విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లింది. కాసేపటికే వాంతులు చేసుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. తలలో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతోందని, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్‌కు తీసుకెళ్లి వైద్యం చేయిస్తుండగానే రాత్రి మృతి చెందాడు. తండ్రి కుమారస్వామి సూచన మేరకు లయన్స్‌క్లబ్ ఎలైట్ సహకారంతో కళ్లు దానం చేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


