వేలం వేస్తే జైలుకే..
సిరిసిల్ల: ఊరంతా ఐక్యంగా ఉంటూ అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆదర్శం. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంతత చెదిరిపోతుందనే సదాశయంతో ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకుంటే స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పారితోషికంగా రూ.10లక్షలు ఇస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుంది. కానీ డబ్బు ఉన్న పెద్దలు పదవులకు వేలం పాడితే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అలాంటి వారు శిక్షార్హులవుతారు. గతంలో ఇలాంటి సంఘటనలో పలువురు అరెస్ట్ అయ్యారు.
వేలం వెర్రి
గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు బహిరంగంగానే వేలంపాటలు నిర్వహించి ఎవరూ ఎక్కువ డబ్బులు ఊరికి చెల్లిస్తే వారే సర్పంచ్ అని వేలం పాడడం చట్టవిరుద్ధం. ధనబలం ఉన్న వారు పదవులను కొనుక్కుంటే ప్రజాస్వామ్యం స్ఫూర్తి గాడితప్పుతుంది. ఇలా గ్రామాల్లో వేలంపాటలు నిర్వహిస్తే ఆ ఎన్నిక చెల్లదు. వేలం నిర్వహించిన గ్రామపెద్దలు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. 2013 గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో వేలం పాటల ఘటనే ఇందుకు సాక్ష్యం.
బస్వాపూర్‌లో ఏం జరిగింది?
2013లో గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే బస్వాపూర్‌లో ధనస్వామ్యం పడగవిప్పింది. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ పదవులకు వేలం నిర్వహించారు. వేలంలో పొన్నం రవి సర్పంచ్ పదవిని రూ.4.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఉపసర్పంచ్ స్థానాన్ని లక్ష్మారెడ్డి రూ.1.50 లక్షలకు దక్కించుకున్నారు. వార్డు సభ్యుల స్థానాలను రూ.25వేల చొప్పున అమ్మకానికి పెట్టారు. ఇది బహిరంగంగానే జరిగింది. ఈ సంఘటనపై అప్పట్లో శ్రీసాక్షిశ్రీ ఆధారాలతో బట్టబయలు చేసింది.
జైలుకెళ్లిన బస్వాపూర్ పెద్దలు
బస్వాపూర్ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు బహిరంగంగానే పంచాయతీ పదవులకు వేలం నిర్వహించారని నిర్ధారించారు. వారి ఎన్నిక చెల్లకపోగా.. వేలం పాటలు నిర్వహించిన పెద్దలు జైలుకు వెళ్లారు.
ఐదేళ్ల అవినీతికి లైసెన్స్
వేలంలో లక్షలు పోసి పదవిని కొనుక్కున్న నాయకులు రేపు ఐదేళ్ల పదవీకాలంలో అడ్డదారులు తొక్కేందుకు గ్రామస్తులే అవకాశమిస్తున్నట్లు అవుతుంది. నిజాయితీగా పల్లెలో పనిచేయాల్సిన సర్పంచ్, వార్డు మెంబర్లను ఒక రకంగా అవినీతికి పాల్పడేందుకే ప్రజలే లైసెన్స్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికవడం, మంచి వ్యక్తులను అలా ఎన్నుకోవడం శుభ పరిణామం. కానీ, ఎవరెక్కువ డబ్బులు వెచ్చిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం అవినీతి పర్వానికి రాచబాటగా మారుతుంది. ఐదేళ్ల పదవీకాలంలో సర్పంచ్ అవినీతిపై నిలదీసి అడిగే దమ్మును ఓటరు కోల్పోతున్నాడు.
స్ఫూర్తిదాయకం కావాలి
ఏకగ్రీవ ఎన్నిక స్ఫూర్తిదాయకం కావాలి. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 82 గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇందులో 25 మంది మహిళా సర్పంచులు ఎన్నికవడం విశేషం. 2013లో జరిగిన ఎన్నికల్లో 40 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో 13 గ్రామాల్లో ఏకగ్రీవమయ్యాయి. అందరూ కూర్చుని మంచివారిని ఎన్నుకోవడం ఆదర్శంగా ఉంటుంది. కానీ వేలం పాటలు నిర్వహించడం నేరమనే విషయాన్ని గుర్తించాలి.
సర్పంచ్, పంచాయతీ పదవులకు బహిరంగ వేలం పాటలు
2013లె బస్వాపూర్‌లో సర్పంచ్ పదవికి రూ.4.10 లక్షలు
ఉపసర్పంచ్‌కు రూ.1.50 లక్షలు
వార్డు సభ్యులకు రూ.25 వేలు
వేలం వేసిన పెద్దల అరెస్ట్
వేలం వేస్తే జైలుకే..


