గుంతల దారి
పగుళ్లు బారి..
● ప్రమాదం అంచున వంతెనలు ● రెయిలింగ్ దెబ్బతిని.. శిథిలావస్థలో వారధులు ● రోడ్లపై గుంతలతో వాహనదారుల ఇబ్బందులు ● జాడలేని మరమ్మతు పనులు ● నిధులున్నా నిర్వహణ కరువు
ఇది ఎల్లారెడ్డిపేట మండలం పదిర–హరిదాస్ నగర్ గ్రామాల మధ్య కామారెడ్డి–కరీంనగర్ రోడ్డుపై నిర్మించిన వంతెన. వంతెనకు రెండు వైపులా గుంతలు పడ్డాయి. పదిర వైపు ఉన్న గుంత మూలంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. హరిదాస్‌నగర్ వైపు ఉన్న గుంతతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సిన దుస్థితి ఉంది. ఈ వంతెనకు ఇరువైపులా మరమ్మతులు చేయాల్సి ఉండగా.. కనీసం పట్టించుకోవడం లేదు. 1989లో భారీ వర్షాల కారణంగా నిజాం కాలంలో నిర్మించిన వంతెన కొట్టుకుపోగా.. ఆగమేఘాలపై ఈ వారధిని అప్పట్లో నిర్మించారు. నిర్మించిన నాటి నుంచి నిర్వహణ లేక వంతెనకు ముప్పు ఏర్పడుతుంది. వంతెనపై ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సి వస్తుంది.
ఇది సిరిసిల్ల–తంగళ్లపల్లి మధ్య మానేరువాగుపై 1978లో నిర్మించిన వంతెన. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి ఇదే. నిత్యం వేలాది వాహనాలు ఈ వంతెనపై నుంచి రాక పోకలు సాగిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వారధి ఇప్పుడు ప్రమాదం అంచున ఉంది. రేయిలింగ్‌లు పలిగిపోయి, వంతెన మధ్యలో గుంతలు పడ్డాయి. కనీస నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన మీదుగా వాటర్ పైపులు, కేబుల్ వైర్లు వేశారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉండే ఈ వంతెన ఇప్పుడు జాతీయ రహదారుల నిర్వహణ(ఎన్‌హెచ్) సంస్థ పరిధిలోకి వెళ్లింది. నేషనల్ హైవే పరిధిలో మరో వంతెన నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా సిరిసిల్ల మానేరు వంతెనపై రోడ్ కం రైల్వే బ్రిడ్జి ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త ప్రతి పాదనలు ఎన్నడు కార్యరూపం దాల్చుతాయో కానీ.. పురాతన వంతెనకు మరమ్మతులు లేవు.
గుంతల దారి


