ఇసుకాసురుల బరితెగింపు
వంతెన కిందే ఇసుక తోడుతున్న వైనం పిల్లర్లకు పొంచి ఉన్న ప్రమాదం గ్రామస్తుల్లో ఆందోళన
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇసుక రవాణాదారులు మరోమారు బరితెగింపునకు పాల్పడ్డారు. మానేరు వంతెన పిల్లర్ల కిందే ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో తహసీల్దార్ చర్యలు చేపట్టిన ఘటన ముస్తాబాద్ మండలం ఆవునూరు మానేరువాగు వద్ద మంగళవారం జరిగింది. వివరాలు.. ముస్తాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అధికారులు ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చారు. ఇదే అదనుగా 100 ట్రాక్టర్లకు పైగా ఇసుక తరలించేందుకు మానేరువాగులోకి దిగాయి. అయితే వంతెన పిల్లర్ల పక్కనుంచే ఇసుకను తోడేయ్యడంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని తుర్కపల్లి, ఆవునూరు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ మాట్లాడుతూ, అధికారులు ఇచ్చిన అనుమతులతో ఇసుక రవాణాదారులు ఇష్టారాజ్యంగా వంతెన పిల్లర్ల వద్ద ఇసుకను తవ్వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వంతెన ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఒకే ట్రాక్టర్ టోకెన్‌పై 4 ట్రిప్పులు కొడుతున్నారని, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై తహసీల్దార్ రామచందర్ మాట్లాడుతూ, మానేరువాగు నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చామన్నారు. కొంతమంది ట్రాక్టర్ యజమానులు వంతెన కిందనుంచే ఇసుకను తీస్తున్నారని విషయం తమ దృషి్?ట్క వచ్చిందన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పది ట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టామని తహసీల్దార్ తెలిపారు.


