ఎక్కడి పనులక్కడే..
● పల్లెపాలనకు నిధుల లేమి ● గ్రామాల్లో ఆగిన అభివృద్ధి ● ఇబ్బందుల్లో ప్రజలు
సిరిసిల్లఅర్బన్: జిల్లాలోని గ్రామపంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. అప్పులు చేసి మరీ పనులు చేపట్టాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిధుల లేమితో అభివృద్ధి పనులు సాగక పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోందని గ్రామీణులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు ఏటా ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తాయి. అయితే రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు రావడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. కనీసం మురుగుకాల్వల నిర్మాణం, చిన్నపాటి మరమ్మతులకు సైతం పంచాయతీల ఖాతాల్లో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ట్రాక్టర్ల నిర్వహణకు నిధులు లేకపోవడంతో కార్యదర్శులు అవస్థలు పడుతున్నారు.
అందని నిధులు.. తప్పని ఖర్చులు
జిల్లాలోని పంచాయతీలకు రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడింది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కార్యదర్శులు అప్పులు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. చిన్న పంచాయతీ కార్యదర్శి ఏడాది వ్యవధిలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు అప్పులు చేశారు. పెద్ద గ్రామపంచాయతీ కార్యదర్శులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అప్పులు చేసి వివిధ పనులకు వెచ్చించారు. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, మురుగు కాలువలు, ట్రాక్టర్ల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు చేయడం భారంగా మారిందని వారు వాపోతున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి చూసినట్లయితే సుమారు 600 జనాభా, 100 వరకు ఇళ్లు, 150 కుటుంబాలు ఉన్న గ్రామంలో ఈ లెక్కన 15వ ఆర్థిక సంఘం నిధులు నెలకు రూ.40 వేలు నుంచి రూ.50వేల వరకు వచ్చేవి. కానీ, ఇక్కడ ఖర్చు రూ.50 వేలు నుంచి రూ.60 వేల వరకు వస్తోంది. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల పరిస్థితి ఇలాగే ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం త్వరగా ఎన్నికలు నిర్వహించినట్లయితే కార్యదర్శులపై పడ్డ భారం కాస్తా కొత్తగా ఎన్నికై న సర్పంచులపై పడుతుందని ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో..
మండలాలు : 12
గ్రామపంచాయతీలు : 260
ట్రాక్టర్లు : 255
జనాభా : 4,16,048
పారిశుధ్య కార్మికులు : 1,207
నిధులు రాగానే పనులు
గ్రామపంచాయతీల అభివృద్ధికి కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. దీంతో గ్రామాల్లో పనులు చేపట్టలేకపోతున్నాం. పంచాయతీల నిర్వహణ కార్యదర్శులకు భారంగా మారుతోంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే అభివృద్ధి పనులు చేపడతాం.
– షర్పొద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి


