‘రీకన్సలేషన్’ వసూళ్లపై విచారణ
● డీఆర్‌డీఏకు సంబంధం లేదు
సిరిసిల్ల: జిల్లాలో 2025–యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన గన్నీసంచుల లెక్కల్లో తేడాలు వచ్చాయి. దీనికి సంబంధించిన రీకన్సలేషన్ పేరిట ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల వద్ద రూ.3వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు పేర్కొంటూ ‘సాక్షి’లో బుధవారం ‘అటు కొనుగోళ్లు.. ఇటు వసూళ్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై కలెక్టర్ ఎం.హరిత స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఈమేరకు డీఆర్‌డీఏ అధికారులు తమ వద్ద అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరూ లేరని, గత యాసంగి సీజన్‌లో డీఆర్‌డీఏ(ఐకేపీ) ద్వారా 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 20.25 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి వచ్చిన గన్నీసంచులు, ఉపయోగించిన సంచులు, తిరిగి వాపస్ ఇచ్చిన సంచుల వివరాలు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఆఫీస్‌లో రీకన్సలేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి డీఆర్‌డీఏకు సంబంధం లేదని, తమ ఆఫీస్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరూ లేరని డీఆర్‌డీవో శేషాద్రి స్పష్టం చేశారు. ఎవరైనా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తగిన ఆధారాలు చూపితే చర్యలు తీసుకుంటామని వివరించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా జిల్లాలో జరుగుతున్న వసూళ్ల పర్వంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం డీఆర్‌డీఏ ఉద్యోగులు, పౌరసరఫరా విభాగంలోనూ చర్చనీయాంశమైంది. వసూళ్లపర్వంపై ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీశారు. కలెక్టర్ ఎం.హరిత ఆదేశాలతో పూర్తి స్థాయి విచారణ చేపట్టడం విశేషం. వసూళ్ల వ్యవహారంలో ఎవరికి వారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని బాధ్యుడిని చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు.
‘రీకన్సలేషన్’ వసూళ్లపై విచారణ


