సీఎమ్మార్ గడువులోగా అందించాలి
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్
సిరిసిల్ల: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) లక్ష్యం గడువులోగా అందించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. 2024–25 ఖరీఫ్, రబీ సీజన్‌ల సీఎమ్మార్ లక్ష్యంపై రైస్‌మిల్లర్లతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో 4,79,922 టన్నుల ధాన్యం దిగుమతి చేసుకున్నారని, దీనికి 3,24,801.263 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,36,711.466 టన్నులు మాత్రమే అందించారని తెలిపారు. జిల్లాలోని రైస్‌మిల్లర్లు ఇంకా 1,88,089.799 టన్నుల బియ్యం అందించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు సీఎమ్మార్ ఇవ్వడంలో వెనుకబడిన మిల్లులను గుర్తించి అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎమ్మార్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించే రైస్‌మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి బదాం చంద్రప్రకాశ్, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు చేపూరి నాగరాజు, పబ్బ నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.


