
నెలాఖరులోగా పూర్తి
చివరి దశకు చేరిన చీరల బట్ట ఉత్పత్తి 4.24 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇప్పటికే 3.75 కోట్ల మీటర్లు సేకరణ రాష్ట్రంలో 67 లక్షల మందికి చీరల పంపిణీ లక్ష్యం
ఇందిరా శక్తి..
సిరిసిల్ల: ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి వేగంగా సాగుతోంది. ఉత్పత్తి లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ఎన్ని గడువులు విధించినా పూర్తి కావడం లేదు. అక్టోబరు నెలాఖరులోగా వంద శాతం ఇందిరా మహిళా శక్తి చీరల బట్టను పూర్తి చేయాలని చేనేత, జౌళిశాఖ అధికారులు గడువు విధించడంతో ఉత్పత్తి వేగం పుంజుకుంది. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో 9,600 పవర్‌లూమ్స్‌పై నిత్యం 4.80 లక్షల మీటర్ల మేరకు చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది.
రెండు రకాల చీరలు
ఇందిరా మహిళా శక్తి పథకంలో రాష్ట్రంలోని 67 లక్షల మంది మహిళలకు ఏకరూప చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు చీరలను డిజైన్ చేసి సిరిసిల్ల నేతన్నలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారుల కు ఆర్డర్లు అందించారు. ఇందులో జరీ అంచు బార్డర్‌తో 6.30 మీటర్ల పొడవు ఉండే చీరలను 55 లక్షల మేరకు ఆర్డర్లు ఇవ్వగా.. మరో 12 లక్షల మేరకు 9 మీటర్ల గోచీ చీరలను ఆర్డర్లు ఇచ్చారు. 58 ఏళ్లు పైబడిన మహిళా సంఘాల్లోని వృద్ధులైన మహిళలకు గోచీ చీరలను అందించేందుకు సిరిసిల్ల లో 9 మీటర్ల పొడవు ఉండే చీరల ఆర్డర్లు ఇచ్చారు. ఈ చీరలు ఇక్కడే ఉత్పత్తి అవుతూ సిరిస్లిల్లలోనే ప్రాసెసింగ్ చేశారు. జరీ అంచుతో కూడిన పాలిస్టర్, కాట న్ మిక్స్ చీరలను సూరత్‌లో ప్రాసెసింగ్ చేశారు. రెండు రకాల చీరలను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబరు 17న పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కలు వేర్వేరుగా సిరిసిల్లలో చీరల ఉత్పత్తిని పరిశీలించారు.
రెండు విడతల్లో ఆర్డర్లు
సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లతోపాటు కరీంనగర్, హన్మకొండ జిల్లాలోనూ చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందించారు. కానీ సిరిసిల్లలో మెజార్టీ పవర్‌లూమ్స్ ఉండడంతో ఇక్కడే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా.. రెండో విడతగా ఏప్రిల్‌లో మరో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వం యారన్(నూలు) డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్ స్టాక్‌గా ఉంచడానికి రూ.50కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేసింది. సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు నూలును 90 శాతం అరువుపై సరఫరా చేసి చీరల బట్టకు నూలును అందించారు.
బతుకమ్మ చీరల కంటే నాణ్యతతో..
గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా.. ఇందిరా మహిళాశక్తి చీర ఖరీదు రూ.480గా నిర్ధారించారు. ఈమేరకు నాణ్యమైన నూలును ప్రభుత్వం సరఫరా చేస్తూ బట్టను ఉత్పత్తి చేయిస్తోంది. పాలపిట్ట కలర్‌లో చీరను డిజైన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

నెలాఖరులోగా పూర్తి

నెలాఖరులోగా పూర్తి