
శాంతియుత సమాజ స్థాపనే లక్ష్యం
● ఎస్పీ మహేశ్ బీ గితే
చందుర్తి (వేములవాడ): సంఘవిద్రోహ శక్తులతో పోరాటం చేసి అమరులైనా పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. మంగళవారం చందుర్తి మండలం లింగంపేట శివారులోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన సంస్మరణ సభకు ఎస్పీ, ఏఎస్పీలు శేషాద్రినిరెడ్డి, చంద్రయ్య హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శాంతి సమాజ స్థాపనకు ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను పోగొట్టుకున్నారని, వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరవవద్దన్నారు. ఈ ప్రాంతం నక్సల్స్ ప్రాబల్యంతో నలిగిపోయిందని, వారి నుంచి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించేందుకు పోలీసులు చేసిన త్యాగం ఫలితంగానే ప్రజలు సుఖ సంతోషాల మధ్య గడుపుతున్నారని గుర్తు చేశారు. సమాజంలోని విపత్కర పరిస్థితులను ఎదుర్కొని పోరాటం చేసేది పోలీసులేనని, తమ యూనిఫాం బాధ్యతలను పెంచుతోందని గుర్తుచేశారు. కుటుంబ సభ్యులు, బంధువులకు దూరంగా ఉండి నిరంతరం విధి నిర్వహణలో ఉండేది ఒక్క పోలీసులేనని, పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. పోలీస్ సేవలను గుర్తించి అన్ని విధాలుగా ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం అమరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. సీఐలు వెంకటేశ్వర్, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్, ఎస్సైలు రమేశ్, అశోక్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.