
చదువే ముద్దు.. గంజాయి వద్దు
● గంజాయి రహిత సమాజం.. మనందరి బాధ్యత ● ఎస్పీ మహేశ్ బీ గీతే
వీర్నపల్లి(సిరిసిల్ల): గంజాయి రహిత సమాజం.. మనందరి బాధ్యత అని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. వీర్నపల్లి మండలం సీతారాంనాయక్‌తండాలో శనివారం శ్రీధూమనాయక్ భూక్యా సామాజిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాల గురించి తెలుసుకోవాలన్నారు. గర్జనపల్లికి చెందిన సీఐడీ ఎస్పీ రాంరెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవ చేయడం అభినందనీయమన్నారు. శ్రీధూమ నాయక్ భూక్యా సామాజిక సేవ ట్రస్ట్ సభ్యులు విజయ, నందిత, రామ్‌సాయి, చంద్రకాంత్, శర్మన్‌నాయక్, నవీన్‌నాయక్, సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మణ్ పాల్గొన్నారు.