ఎగువ మానేరుపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఎగువ మానేరుపై నిర్లక్ష్యం

Oct 16 2025 5:09 AM | Updated on Oct 16 2025 5:09 AM

ఎగువ మానేరుపై నిర్లక్ష్యం

ఎగువ మానేరుపై నిర్లక్ష్యం

మధ్య, దిగువమానేరు ప్రాజెక్టుల్లో పూడికతీత ఎగువమానేరులో ప్రతిపాదనలకు నో 75 ఏళ్లుగా తట్టెడు మట్టి తీయని పాలకులు పూడికతో తగ్గిన ఒక టీఎంసీ నీటి సామర్థ్యం చివరి ఆయకట్టుకు అందని నీరు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఎగువమానేరు ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి గురువుతోంది. 75 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులో పూడికతీయకపోవడంతో నీటి సామర్థ్యం సగానికి పైడా పడిపోయింది. ఎగువమానేరు ప్రాజెక్టు ఆధారంగా పారే మానేరువాగుపైనే మధ్య, దిగువమానేరు ప్రాజెక్టులను నిర్మించారు. సముద్ర మట్టాలనికి అత్యంత ఎత్తులో ఉండే సిరిసిల్ల మెట్టప్రాంతానికి జీవనాధారమైన ఎగువమానేరు ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. మధ్యమానేరు ప్రాజెక్టుతోపాటు దిగువ మానేరు ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఈ రెండు ప్రాజెక్టులకు ఎగువనే ఉన్న నర్మాల ప్రాజెక్టుపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు తట్టెడు మట్టిని కూడా తీయలేదనే అపవాదు ఉంది. తాజాగా మధ్యమానేరు, లోయర్‌మానేరు(ఎల్‌ఎండీ)లలో పూడికతీత పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.

నిజాం కాలం నాటి నర్మాల ప్రాజెక్టు

1945లో ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నర్మాల వద్ద కూడవెల్లి, పాల్వంచవాగులు కలిసే చోట ప్రాజెక్టును నిర్మించారు. రూ.1,29,288లతో 17,680 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. 1945లో మొదలైన పనులు 1950లో పూర్తయ్యాయి. ఆరుగురు చీఫ్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో ఐదేళ్లలో నిర్మించిన ప్రాజెక్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రాజెక్టు ఆనాటి చక్కటి ఇంజినీరింగ్‌ పనితనానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్‌ను ఏనాడు తీయలేదు. 2002లో అప్పటి మంత్రి, నేరెళ్ల ఎమ్మెల్యే కుడి కాలువను సీసీ చేయించారు. అది మినహా ఏ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం నిధులను కేటాయించలేదు.

రెండు ప్రాజెక్టులకు నిధులు

ఎగువ మానేరు ప్రాజెక్టు కింద ఉన్న మధ్యమానేరు, దిగువ మానేరు ప్రాజెక్టుల్లో డీసిల్టింగ్‌, డ్రెజింగ్‌ విధానంతో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఎల్‌ఎండీలో పనులు కొనసాగుతున్నాయి. మధ్యమానేరులో నీటిమట్టం తగ్గగానే పూడికతీత పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎల్‌ఎండీలో ట్రయల్‌రన్‌ పూర్తి చేశారు. డీసిల్టింగ్‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తోంది. పూడికమట్టిని రైతులకు అందించడం ద్వారా, అక్కడే లభించే ఇసుకను విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరనుంది. ప్రాజెక్టుల్లో డీసిల్టింగ్‌ ద్వారా నీటి సామర్థ్యం పెరగనుంది.

తగ్గిన ఒక టీఎంసీ సామర్థ్యం

ఎగువమానేరు ప్రాజెక్టును 75 ఏళ్లుగా డీసిల్టింగ్‌ చేయకపోవడంతో దాని సామర్థ్యం తగ్గిందని ఇంజినీర్లు చెబుతున్నారు. మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టులో సిల్ట్‌ పేరుకుపోవడంతో ఒక టీఎంసీ సామర్థ్యం తగ్గిందని పేర్కొంటున్నారు. దీంతో 18వేల ఎకరాలకు అందించాల్సిన నీరు ప్రస్తుతం 12వేల ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాల్సి వచ్చింది. ఎగువమానేరు ప్రాజెక్టు సిల్ట్‌ తొలగిస్తే ఒక టీఎంసీ పెరిగి జిల్లెల్ల, దేశాయిపల్లి, బద్దెనపల్లి, తాడూరు వరకు సాగునీటిని అందించవచ్చు. అయితే ఈ ప్రాజెక్టులో డీసిల్టింగ్‌కు అధికారులు చేసిన ప్రతిపాదనలకు మంజూరు రాలేదు. వచ్చే ఏడాదైనా నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement