
ఎల్‌ఈడీ స్క్రీన్‌లో దర్శనం
అందరి సలహాలు, సూచనల మేరకు పనులు
19న వేములవాడకు శృంగేరి పీఠాధిపతి రాక
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులపై సమీక్ష
హాజరైన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ ఎం. హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే
వేములవాడ: రాజన్న ఆలయంలోని రావిచెట్టు వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లో దర్శనం కల్పించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధే ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి, ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతిస్వామి రాక సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, వీటీడీఏ వైస్‌చైర్మన్, కలెక్టర్ హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే తదితరులతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను అందరి సలహాలు, సూచనల మేరకు చేపడుతున్నట్లు వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రుల సహకారంతో పనులు ముందుకుసాగుతున్నాయని తెలిపారు. మొదటిదశలో రూ.76కోట్లతో ప్రధాన ఆలయ విస్తరణ, అభివృద్ధి, రూ.35 కోట్లతో నిత్యాన్నదానం, రూ.47కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఆలయ పనులపై ప్రతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీకిస్తున్నామని తెలిపారు.
19న శృంగేరి పీఠాధిపతి
విధుశేఖర భారతీస్వామి రాక
ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతిస్వామి రానున్నారని వెల్లడించారు. ఆమేరకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించామని పేర్కొన్నారు. భక్తులకు రాజన్న ఆలయ ఆవరణలోని రావిచెట్టి వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్, ప్రచారరథంలో శ్రీస్వామి వారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.
రాజన్న సేవలో రాష్ట్ర
దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
రాజన్నను రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఆర్డీవో రాధాభాయి, వీటీడీఏ అధికారులు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి, అర్చకుల బృందం స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు.