
మందకొడిగా మద్యం దరఖాస్తులు
● వ్యాపార వర్గాల్లో కనిపించని ఉత్సాహం ● నిబంధనలు మారుతాయని అనుమానాలు
సిరిసిల్ల క్రైం: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తుల విషయంలో ఆసక్తి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 48 మద్యం దుకాణాలకు అనుమతి ఉండగా ఇప్పటి వరకు 435 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల గడువు ఈనెల 18వ తేదీతో ముగియనుండగా ఆసక్తి కనిపించడం లేదని తెలుస్తోంది.
పావులావంతు రాలే..
గతంలో వచ్చిన దరఖాస్తులలో పావులా వంతు కూడా దరఖాస్తులు రాలేదని గణాంకాలు తెలుపుతున్నాయి. పోయిన సారి దరఖాస్తులు 2,036 రాగా.. ఈసారి పావులా వంతు కూడా రాలేదు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త లైసెన్స్ నిబంధనల కఠినతరం, భారీ డిపాజిట్‌లు, అనుకోని ఖర్చులు, మార్కెట్‌లో మద్యం విక్రయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా పెరుగుతోందనే ప్రచారంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయినా చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.