
హాస్టల్ భవనాన్ని మార్చండి
● తల్లిదండ్రుల నిరసన
సిరిసిల్ల అర్బన్: పెద్దూరులోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల హాస్టల్‌ను మార్చాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. వారు హాస్టల్‌లో 379 మంది విద్యార్థులు ఉండగా 8 గదులు మాత్రమే ఉన్నాయన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో తరగతికి 70 మంది వరకు విద్యార్థులు ఉండగా.. అందులోనే చదువుకోవడం, పడుకోవడం ద్వారా ఇబ్బంది పడుతున్నారన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయం సిబ్బందికి శనివారం నోటీస్‌లు వచ్చాయి. పాఠశాలలో శుక్రవారం అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటనపై డీఈవో వినోద్‌కుమార్ స్పందించారు. ఈ షోకాజ్ నోటీసులకు కేజీబీవీ సిబ్బంది సంజాయిషీ సైతం ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత పడతామని లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చామని కేజీబీవీ ఎస్‌వో శకుంతల తెలిపారు.
భక్తులపై దాడి చేస్తే కేసులు పెడతాం
వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై దాడులకు దిగినా, భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేసినా కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. పట్టణంలో రోడ్లపై తిరుగుతున్న పలువురు హిజ్రాలకు శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో సీఐ కౌన్సెలింగ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని కందికట్కూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు శని వారం బీటీ రోడ్డుపై బైటాయించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులు, ప్రీప్రైమరీలో మరో 22 మంది ఉంటే.. ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. మరో టీచర్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి పాఠశాల పరిస్థితులపై విన్నవించారు.
వైభవంగా మహాలింగార్చన
వేములవాడ: రాజన్న సన్నిధిలో శనివారం రాత్రి మహాలింగార్చన వైభవంగా నిర్వహించారు. స్వామి వారి మహామంటపంలో ఆలయ అర్చకులు రెండు గంటలపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం మాసశివరాత్రి వేడుకలు నిర్వహించారు.
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రజలను కుక్కలు, కోతుల నుంచి రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. స్థానిక బీవై నగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో శనివారం విలేకరుల స మావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలో కుక్కలు, కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు కోడం రమణ, జిందం కమలాకర్ పాల్గొన్నారు.

హాస్టల్ భవనాన్ని మార్చండి

హాస్టల్ భవనాన్ని మార్చండి

హాస్టల్ భవనాన్ని మార్చండి