
ఇంటర్‌లో ఉత్తీర్ణత పెరగాలి
సిరిసిల్ల: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత మరింత పెరగాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్య, రానున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, వివిధ అంశాలపై ప్రభుత్వ జూనియర్, సోషల్, బీసీ, ట్రైబల్, మైనార్టీ సంక్షేమ కళాశాలలు, టీజీ రెసిడెన్షియల్, మోడల్‌స్కూల్, కేజీబీవీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో గురువారం సమీక్షించారు. జిల్లాలో మొత్తం 42 ప్రభుత్వ, 6 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, ఫస్టియర్‌లో 4,302, సెకండియర్‌లో 3,874 మంది చదువుతున్నారని డీఐఈవో శ్రీనివాస్ తెలిపారు. గతేడాది ఉత్తీర్ణత తక్కువ ఉన్న కళాశాలల ప్రిన్సిపాల్స్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. యూడైస్, ఎఫ్‌ఆర్‌ఎస్ వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ జంతువులు, కోతులతో ఇబ్బందులు ఎదురవుతున్న విద్యాలయాల బాధ్యులు సోలార్ ఫెన్సింగ్ కోసం డీఐఈవో దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.