
సమాచారం తెలుసుకునే హక్కు అందరికీ ఉంది
● రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి
సిరిసిల్ల: జిల్లాలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)–2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రెండేళ్లుగా ఆర్టీ కమిషనర్ నియామకం కాకపోవడంతో 17 వేల కేసులు పెండింగ్ ఉన్నాయని, కేసులను పరిష్కరించడంలో ఆర్టీఐపై నెలకొన్న నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నామని వివరించారు. కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా మాట్లాడుతూ, 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టంతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగిందన్నారు. ప్రతి అధికారి తన హక్కులు, బాధ్యతలు చట్టపరంగా పాటించాల్సిన మార్గదర్శకాలను తెలుసుకొని సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తప్పుడు సమాచారం అందించినా, ఆలస్యం చేసినా ఆర్టీఐ చట్టం సెక్షన్ 21, 22 ప్రకారం కమిషన్ చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం సంబంధించి జిల్లాలో పెండింగ్ ఉన్న 134 కేసులను కమిషన్ సభ్యులు ప్రస్తావించారు. వీటిని వెంటనే పరిష్కరించాలని కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మెహసిన పర్వీన్‌లు కోరారు. సిరిసిల్ల, వేములవాడ ఏఎస్పీలు చంద్రయ్య, శేషాద్రినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో సమాచార చీఫ్ కమిషనర్, బృందం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.