
కోర్టు సముదాయం పనులకు మోక్షం
● రూ.86 కోట్లతో ఐదు అంతస్తుల భవనం ● కొత్త భవనం పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లో కోర్టులు
సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన సముదాయ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే సుమారు 5 ఎకరాల స్థలంలో ఐదు అంతస్తుల్లో నూతన భవన నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు పాత స్థానంలో ఉన్న పలు న్యాయస్థానాలు అద్దె భవనాల్లోకి మారిపోనున్నాయి. ఈ నెల 13న లోక్ అదాలత్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో 15నుంచి అద్దె భవనాల్లో కొనసాగనున్నాయి. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సూచనల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంబంధిత ఆదేశాలు జారీ చేశారు. అనంతరం త్వరితగతిన ప్రస్తుతం ఉన్న న్యాయస్థాన సముదాయం నిర్మాణ సంస్థకు అప్పగించబడుతుంది. కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు, పోక్సో కోర్టులు, పాలన పరమైన కార్యాలయాలు పూర్వ స్థలంలోనే కొనసాగుతాయి. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కొత్త బస్టాండ్ సమీపంలో మున్సిపల్ కమిషనర్ రెసిడెన్షియల్ క్వార్టర్‌లో నిర్వహించబడుతుంది.
సర్దార్ నగర్‌లో మూడు కోర్టులు
న్యాయస్థాన భవన నిర్మాణ పనుల ప్రారంభం కానున్న నేపథ్యంలో కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న మూడు కోర్టుల నిర్వహణకు సర్దార్‌నగర్‌లో (ప్రసాద్‌రావు పిల్లల హాస్పిటల్ వెనుక) నాలుగు అంతస్తుల భవనాన్ని ఎంపిక చేశారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సెకండ్ అడిషనర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రతిపాదిత భవనంలో వరుసగా మొదటి, రెండో, మూడో అంతస్తుల్లో కొనసాగనున్నాయి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి (పోక్సో) కోర్టు యథాతథంగా కొనసాగనున్నాయి. అలాగే కోర్టు ప్రాంగణంలో ఇప్పటి వరకు కొనసాగిన క్యాంటీన్, జిరాక్స్ సెంటర్లను ఈ నెలాఖరు వరకు ఖాళీ చేసి నిర్మాణ సంస్థకు అప్పగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాలు జారీ చేశారు.