
చిరుత.. జాగ్రత్త!
● జిల్లాలో చిరుత పులుల సంచారం ● భయాందోళనలో రైతులు ● అవగాహన కల్పిస్తున్న ఫారెస్ట్ అధికారులు ● ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరికలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వ్యవసాయ పనులు జోరందుకున్న వేళ పొలాలకు వెళ్తున్న రైతుల గుండెల్లో గుబులు. పచ్చికబైళ్లలో పశువులను మేపుతున్న కా పరుల కళ్లలో భయం. పొద్దున వెళ్లినప్పటి నుంచి ఇంటికి చేరేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులు చేస్తున్నారు. ఇందుకు కారణం.. జిల్లాను చిరుతపులుల భయం వణికిస్తోంది. ఇన్నాళ్లు అటవీ ప్రాంతాలకే పరిమితం అయిన చిరుతలు పొలాలు, ఆవాసాల వైపు వస్తున్నాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాల్లో కొన్నాళ్లుగా చిరుతలు సంచరిస్తున్నాయనే సమాచారం ఆయా ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నా గుబులు పోవడం లేదు.
మైదాన ప్రాంతాల్లో సంచారం
చిరుతలు గతంలో ఎప్పుడూ ఎల్లారెడ్డిపేట మండలంలోని సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిని దాటి దక్షిణం వైపునకు రాలేదు. వీర్నపల్లి మండలం వైపు గల ప్రాంతంలోని సంచరించేవి. ఇటీవల ఎల్లారెడ్డిపేట పరిధిలోని రాగట్లపల్లి, హరిదాస్‌నగర్, పదిర శివారులో సంచరించాయి. పాదముద్రలను సేకరించిన అటవీ అధికారులు రైతులను ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోనూ చిరుతలు పశువులపై దాడి చేశాయి. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో ఓ గేదైపె దాడిచేసింది. కొండగట్టు అటవీ ప్రాంతం నుంచి చందుర్తిలో ప్రవేశించినట్లు గతంలోనే ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. వేములవాడరూరల్ మండలం నుంచి బోయినపల్లి, వట్టెంల వెళ్లే మార్గాల్లో చిరుతలు సంచరించాయి. కోనరావుపేట మండలం శివంగాలపల్లిని ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ఏరియాలో పశువులపై దాడి చేశాయి.
బాబోయ్ పులి?
కామారెడ్డి జిల్లాలోకి కవ్వాల్ నుంచి పులి వచ్చిందన్న అటవీ అధికారుల హెచ్చరికలతో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పెద్దమ్మ జంగల్ శివారును ఆనుకుని ఉన్న గ్రామాలు, వీర్నపల్లి మండలంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. పులి జిల్లాలోకి వచ్చి, వెళ్లినట్లు ఆనవాళ్లు లేవని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా వీర్నపల్లి మండలంలోని రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.

చిరుత.. జాగ్రత్త!