
అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక ఉచితంగా అందిస్తున్నామని, గ్రామ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్లు ఏమైనా సమస్యలు ఉంటే తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎక్కడైనా అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో విపత్తుల నివారణకు హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదలు, ఆపద సమయాల్లో 93986 84240 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీ.హెచ్.వెంకటేశ్వర్లు, రాధాభాయ్ పాల్గొన్నారు.
భూ సమస్యలను పరిష్కరించాలి
భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరి ష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. భూసమస్యలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో భోజనాలు, వసతులపై ఆరా తీశారు.
చదవడం, రాయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
వేములవాడ: పాఠశాలలోని ప్రతి విద్యార్థి చదవడం, రాయడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రతీ తరగతి గదిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? ఎవరైనా దీర్ఘకాలికంగా పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారా అని ఆరా తీశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్యాస్ సిలిండర్ ఇంకా రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.