
‘ఉపాధి’ కూలీలకు భరోసా
జిల్లా సమాచారం
మండలాలు 13
గ్రామపంచాయతీలు 255
జాబ్‌కార్డులు 1,02,309
మహిళా కూలీలు 66,508
పురుష కూలీలు 35,801
పని చేసే కూలీలు 83,159
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పథకాన్ని అమలు చేస్తోంది. భూమిలేని నిరుపేదలకు రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లుగా ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రబీ, ఖరీఫ్ సీజన్‌లలో రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు అందించాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 11,267 కుటుంబాలను గత జనవరిలో గ్రామసభల ద్వారా అధికారులు ఎంపిక చేశారు. ఈమేరకు ఇప్పటికే జిల్లాలోని ప్రతీ మండలంలోని ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులకు మొదటి విడతగా రూ.6వేలు వారి ఖాతాల్లో జమచేసింది. ఇలా తమకు ఆర్థికసహాయం అందడంతో నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 11,267 అర్హులు
జిల్లాలోని 255 గ్రామాల్లోని అర్హులను ఎంపిక చేయనున్నారు. భూమిలేని నిరుపేదలు, ఉపాధిహామీ పనులకు హాజరై ఉంటేనే ఈ పథకానికి అర్హులు. కనీసం ఏడాదికి జాబ్‌కార్డులో 20 రోజులు పనిచేసి ఉండాలి, వారి కుటుంబానికి ఎలాంటి భూమి ఉండొద్దు. ఇలా జిల్లా వ్యాప్తంగా 11,267 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. కాగా పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడతగా రూ.6వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేసింది. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. ఆ గ్రామంలో మొదటి విడతగా 94 మందికి రూ.6వేల చొప్పున ఖాతాల్లో జమచేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 పైలట్ గ్రామాల వ్యాప్తంగా 384 మందికి రూ.6వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేసింది. మిగతా జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన అర్హులకు త్వరలోనే అందనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం
జిల్లాలో 11,267 మంది ఎంపిక
ఏడాదికి రూ.12వేలు
ఆత్మీయ భరోసా పేరుతో అందించనున్న ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు