
ఇందిరా మహిళాశక్తితో ఆర్థిక ప్రగతి
● డీఆర్డీవో శేషాద్రి ● కలెక్టరేట్‌లో ఇందిరా మహిళాశక్తి సంబురాలు
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారని డీఆర్డీవో శేషాద్రి అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మాట్లాడారు. వివిధ మహిళా సంఘాల వీవోల విజయాలను, తమ సంఘం ప్రగతిని వివరించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పెరటి కోళ్ల పెంపకం, డెయిరీ యూనిట్, పిండి గిర్నీ, మూడు సీహెచ్‌సీలు, స్కూల్ యూనిఫామ్ ఇతర స్వయం ఉపాధి పథకాలకు ఆర్థికంగా భరోసా అందిస్తుందని వెల్లడించారు. రుణాలు చెల్లించడంలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య ఉత్తమ సేవలతో జాతీయ పతకానికి ఎంపికై ందని అన్నారు. వివిధ మార్కెట్ కమిటీ చైర్‌పపర్సన్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందన్నారు. ఉచిత బస్సు, విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నదని తెలిపారు. తాము ఉపాధి పొందుతూ మిగతా వారికి పని కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు స్వరూపారెడ్డి, సబేరా బేగం, కొమిరిశెట్టి విజయ, రాణి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, అడిషనల్ డీఆర్డీఓ సీ హెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.