
ఈదురుగాలుల బీభత్సం
● విరిగిపడ్డ విద్యుత్ స్తంభం ● కొనుగోలు కేంద్రంలో నిలిచిన నీరు ● తడిసిన ధాన్యం
ఇల్లంతకుంట(మానకొండూర్): జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా.. విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. మామిడితోటల్లోని కాయలు నేలరాలిపోయాయి. ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లి, రామాజీపేట, వెల్జీపురం, ఓబులాపురం గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చిక్కుడువానిపల్లిలో చింతమడక శంకరయ్య ఇంటిపైన రేకులు లేచిపోయాయి. రేకులపై బరువుగా పెట్టిన రాయి శంకరయ్య భార్య శ్యామలపై పడడంతో గాయపడింది. అదే గ్రామంలో కంకటి బాలయ్య వ్యవసాయబావి వద్ద కరెంటు స్తంభం నేలకొరిగింది. వెల్జీపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నీరు నిలిచింది.
తంగళ్లపల్లి/కోనరావుపేట/వేములవాడ: తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో అకాల వర్షానికి ఆకారపు రాజయ్యక రేకుల ఇల్లు కూలింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో పిడుగుపడి అక్కెనపల్లి రమేశ్‌కు చెందిన రూ.80వేల విలువైన ఆవు చనిపోయింది. అహ్మద్ హుస్సేన్‌పల్లిలో అక్కెనపల్లి శంకరయ్య ఇంటిగోడ కూలింది. సమీపంలోని సింగిల్‌విండో గోదాము రేకులు లేచి, అక్కడే పడ్డాయి. గ్రామానికి చెందిన కొప్పెర లింగారెడ్డి ఇంటి వద్ద చెట్టుపై పిడుగుపడింది. వేములవాడ పట్టణంలో భారీ వర్షం కురిసింది. అరగంటపాటు కురిసిన వర్షానికి రోడ్డుపై వరదనీరు నిలిచింది.