
రైల్వేస్టేషన్లకు తుదిమెరుగులు
● దాదాపు పూర్తయిన రామగుండం, కరీంనగర్ స్టేషన్లు ● ఆధునికీకరణలో ముందడుగు.. ఈనెల 15న ప్రారంభం? ● లిఫ్టులు, ఎస్కలేటర్లు, అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం పూర్తి ● తుదిదశలో స్వాగత తోరణాలు, సుందరీకరణ పనులు ● కరీంనగర్ ఆర్వోబీ కోసం రైల్వేగేట్ పక్కకు తరలింపు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల పనులు దాదాపు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అన్నీ కుదిరితే.. ఈనెల 15న ప్రారంభోత్సవం జరగవచ్చని రైల్వేవర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 27న కరీంనగర్, రామగుండం స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించాల్సింది. అయితే భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వాయిదాపడింది. ఈసారి అనుకుంటున్న 15వ తేదీన జరగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పెద్దపల్లిలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంఆర్‌యూటీ) దీనినే అమృత్ పథకం కింద కేంద్రం రూ.73 కోట్లు ఈ మూడు స్టేషన్ల కోసం విడుదల చేసింది. తొలిదశలో కరీంనగర్ రూ.26.06, రామగుండం రూ.26.50 కోట్లు విడుదల కాగా.. రెండో దశలో పెద్దపల్లికి రూ.20 కోట్లు విడుదలయ్యాయి.
కరీంనగర్, రామగుండంకు సరికొత్త రూపు
రోజుకు ఒకటి, రెండు మినహా పెద్దగా రైళ్లు రాని కరీంనగర్ స్టేషన్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. స్టేషన్‌లో రెండు దశాబ్దాలుగా ఉన్న ఒక్క ప్లాట్‌ఫారానికి అదనంగా 2, 3 ప్లాట్‌ఫారాలు నిర్మించారు. వాటిని వృద్ధులు, వికలాంగులు వినియోగించుకునేలా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు నిర్మించారు. స్వాగత తోరణాలు, స్టేషన్ ముఖద్వారం ఎలివేషన్, పార్కు పూర్తికావొచ్చా యి. ఇవి కాకుండా మరుగుదొడ్లు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి, బుకింగ్ కార్యాలయం, ఆర్పీఎఫ్ పోస్టు, కేటీరింగ్ స్టాల్స్, వెయిటింగ్ రూములు, రిజర్వ్‌డ్ లాంజ్‌లతోపాటు కమర్షియల్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ మేనేజర్, చీఫ్ గూడ్స్ సూపర్‌వైజర్, డిప్యూటీ స్టేషన్ మేనేజర్లకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించారు. రామగుండం రైల్వేస్టేషన్ ఆధునీకరణ, సుందరీకరణ పనులు కరీంనగర్ కంటే ముందే పూర్తయ్యాయి. దీని వీడియోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెద్దపల్లి స్టేషన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండో ఫేజ్‌లో నిధులు మంజూరవడంతో ఇక్కడ పనులు ఇంకా సగం కూడా పూర్తి కాలేదు.
ఆర్వోబీ కోసం.. రైల్వేగేటు తొలగింపు
రైల్వేస్టేషన్ నిర్మాణ పనులతోపాటు కరీంనగర్– చొప్పదండి మార్గంలో ఆర్వోబీ పనులు కూడా ఊపందుకున్నాయి. ట్రాక్‌కు రెండువైపులా నిర్మాణాలు రైల్వేగేట్ వరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్వేగేటు తొలగించి అక్కడ పిల్లర్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రస్తుతమున్న రైల్వేగేట్‌ను తొలగించి పక్కకు తరలించి ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. వాస్తవానికి ఇప్పటికే పూర్తి కావాల్సిన ఆర్వోబీ నిర్మాణం ఇంకా కొనసాగుతూ.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తోంది. ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు ముదరడంతో బాధలు రెట్టింపయ్యాయి. అంబులెన్స్‌లో కరీంనగర్‌కు వచ్చే రోగుల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది.