● హ్యాండ్లూమ్, పవర్‌లూమ్స్‌కు రూ.2వేల కోట్లు ఇవ్వాలి ● ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కార్మికనేతల వినతి
సిరిసిల్లటౌన్: చేనేత, పవర్‌లూమ్స్ రంగాలకు రూ.2వేల కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు, పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ కోరారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ బృందం అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి బట్టి విక్రమార్కను వేములవాడ ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి సోమవారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ చేనేత, పవర్‌లూమ్ పరిశ్రమల్లో సంక్షోభంతో 15 నెలల్లోనే దాదాపు 30 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సిరిసిల్లలో ఇప్పటికే పూర్తయిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని కో రారు. కూరపాటి రమేశ్, కోడం రమణ ఉన్నారు.
గురుకులాల్లో గీజర్లు ఏర్పాటు చేయండి
– అసెంబ్లీలో విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: గురుకుల విద్యాలయాల్లో సోలార్ ఆధారిత గీజర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శాసనసభలో గురుకులాల నిర్వహణపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆది శ్రీనివాస్ ఈమేరకు విన్నవించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రాధాన్యత ఉన్న అన్ని గురుకులాల్లో తక్షణమే గీజర్లను ఏర్పాటు చేయాలని శాసనసభ వేదికగా ప్రభుత్వానికి సూచించారు. స్పందించిన మంత్రి సీతక్క తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.