ఆధారం కావాలి | - | Sakshi
Sakshi News home page

ఆధారం కావాలి

Nov 12 2023 12:48 AM | Updated on Nov 12 2023 12:48 AM

 సిరిసిల్లలోని పవర్‌లూమ్‌ పరిశ్రమ - Sakshi

సిరిసిల్లలోని పవర్‌లూమ్‌ పరిశ్రమ

కూలీ డబ్బులు ఆటో కిరాయిలకే..

రోజంతా కాళ్లు చేతులు ఆడిస్తూ చేనేత మగ్గంపై బట్ట నేస్తే రూ.150 కష్టంగా వస్తున్నాయి. మండేపల్లి ఇందిరమ్మకాలనీ నుంచి వచ్చి పోయేందుకు రూ.60 పోతున్నాయి. మీటర్‌ బట్ట నేస్తే రూ.28.50 ఇస్తున్నారు. మీటరుకు రూ.50 ఇస్తే.. మాకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ప్రభుత్వం కూలీ పెంచాలి.

– జడల రాజేశం, చేనేత కార్మికుడు

వర్కర్లను ఓనర్లు చేయాలి

సిరిసిల్లలో వర్కర్‌ టు ఓనర్‌ పథకాన్ని ప్రకటించి పదేళ్లు అవుతుంది. సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసి ఆరేళ్లు అయింది. ఇంకా షెడ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. వర్కర్లను ఓనర్లుగా మార్చితే కార్మికుల జీవితాల్లో ఉపాధి ఆశలు శాశ్వతమవుతాయి. కార్మికులకు ఇచ్చే 10 శాతం యారన్‌ సబ్సిడీని ఎప్పటికప్పుడు అదే ఏడాదే ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. కార్మికుల కూలీ రేట్లను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలి.

– కోడం రమణ, కార్మిక నాయకుడు

పెన్షన్లు రావడం లేదు

ఇరవై ఏళ్లుగా చేనేత సాంచాలపై బట్టనేస్తున్నా. బట్టకు, పొట్టకే సరిపోతున్నాయి. నేతకార్మికులకు ప్రత్యేకంగా జౌళిశాఖ ద్వారా అదనపు పెన్షన్‌ ఇస్తామన్నారు. కానీ మాకు రావడం లేదు. ఇతర ప్రాంతాల్లో వస్తున్నాయి. చేనేత మగ్గాన్ని నడిపేవాళ్లు లేరు. మా తరువాత ఎవరూ బట్ట నేయరు. మాకు అదనపు పెన్షన్‌ ఇవ్వాలి.

– గుర్రం లక్ష్మణ్‌, చేనేత కార్మికుడు

యారన్‌ డిపో ఏర్పాటు చేయాలి

సిరిసిల్లలో యారన్‌ డిపో ఏర్పాటు చేస్తామని ఎప్పటి నుంచో నాయకులు హామీలు ఇస్తున్నారు. సిరిసిల్లలో యారన్‌ డిపోను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నేరుగా నూలు తెచ్చుకుని బట్ట నేసుకుంటారు. ప్రైవేటు కంపెనీల డిపోల ఏర్పాటుకు కూడా చేయూతనివ్వాలి. నూలు డిపోలు ఉంటే ఆసాములకు, కార్మికులకు దీర్ఘకాలిక మేలు జరుగుతుంది. పరిశ్రమ స్థిరపడుతుంది.

– చిమ్మని ప్రకాశ్‌, ఆసామి

సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్లలో జోట ఆడితేనే పూట గడుస్తుంది. నిత్యం కళ్లలో వత్తులు వేసుకుని పోగులతో పోరాడితేనే పొట్ట నిండుతుంది. జ్వరం వచ్చి పనికి వెళ్లకున్నా.. శుభకార్యాలు ఉండి కార్ఖానాలకు పోకపోయినా.. ఆ పూటకు ఇబ్బంది పడే దుస్థితి. పని చేయకుంటే ఇల్లు గడవడం గగనమే.. ఇది సిరిసిల్ల నేతన్నల దుస్థితి. చేనేత కార్మికుల పరిస్థితి మరీ దారుణం. రోజంతా పనిచేస్తే రూ.150 కూలీ గిట్టుబాటు కావడం లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాలున్న సిరిసిల్లకు రెండో షోలాపూర్‌గా పేరుంది. 25 వేల కుటుంబాలు వస్త్రోత్పత్తిపై ఆధారపడి ఇక్కడే ఉంటున్నాయి. నేతల తలరాతలను మార్చేశక్తి వీరికి ఉంది. ఎన్నికల వేళ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు.. అని వస్త్రపరిశ్రమలో పనిచేసే వారిని, ఆ రంగంతో అనుబంధం ఉన్న వారిని పలకరిస్తే.. వర్కర్లు ఓనర్లు కావాలన్నారు. పనిగంటలు తగ్గించి శ్రమదోపిడీ పోవాలన్నారు. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేలా ఉపాధి చూపాలన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నేతన్నల మనసులో మాటలు ఇవీ..

పనికి గ్యారంటీ ఉండాలి

చేతినిండా పని ఉండాలి. ఇప్పుడు బీములు నింపితే నెలకు రూ.6వేల నుంచి రూ.8వేలు వస్తున్నాయి. కనీసం నెలకు రూ.18వేలు వచ్చేలా పనికి గ్యారంటీ ఉండాలి. ప్రభుత్వమే ఆర్డర్లతో సేట్లకు లాభాలు ఉన్నాయి. మాకు ఏం లాభం లేదు. సర్కారు మధ్యవర్తిగా ఉండి కూలీ రేట్లను పెంచాలి. – జిందం లక్ష్మణ్‌,

వైపని కార్మికుడు, రాజీవ్‌నగర్‌

పనిగంటలు తగ్గాలి

రోజుకు 12 గంటలపాటు సాంచాల మధ్య పనిచేస్తే నెలకు రూ.8 వేలు వస్తున్నాయి. ఇదే పని బతుకమ్మ చీరలు నడిపితే రూ.14వేలు వస్తాయి. పని గంటలు తగ్గించాలి. రోజుకు 8 గంటలు పనిచేస్తే ఇదే కూలి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. వర్కర్లను ఓనర్లుగా మార్చితే కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. యారన్‌ సబ్సిడీని విడుదల చేయాలి.

– పెద్ది శివ, పవర్‌లూమ్‌ కార్మికుడు

వర్కర్లను ఓనర్లు చేయాలి

పనిగంటలు తగ్గించి.. కూలి పెంచాలి

ప్రత్యామ్నాయ పరిశ్రమలు రావాలి

ఇది సిరిసిల్ల నేతన్నల ఎజెండా

1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement