ఔట్‌సోర్సింగ్‌కు ఆధార్
● ఏజెన్సీల అక్రమాలకు చెక్ ● ఆధార్ ఇవ్వకుంటే వేతనాలు బంద్ ● ఈనెల నుంచే అమలు ● ఆగమేఘాలపై ఆధార్‌తో అనుసంధానం
సిరిసిల్ల: ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఔట్‌సోర్సింగ్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేయకుండానే.. రికార్డుల్లో చూపే వారికి అందే వేతనాలు నిలిచిపోనున్నాయి. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగులను నియమించకుండానే రికార్డుల్లో చూపిస్తూ.. లేని ఉద్యోగుల పేరిట వేతనాలు దండుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాస్తవానికి పనిచేసే ఉద్యోగుల కంటే ఎక్కువ మందిని రికార్డుల్లో చూపిస్తూ జీతాలు పొందుతున్నట్లు ఇటీవల సెక్రటేరియట్‌లో జరిగిన తనిఖీల్లో వెలుగుచూసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్‌కార్డులను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ వివరాలు నమోదు చేసిన వారికే ఈ నెల వేతనాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్‌కార్డులను సేకరిస్తున్నారు.
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలు
జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నర్సింగ్, మెడికల్ కాలేజీలు, వేములవాడ రాజన్న ఆలయం, వేములవాడ ప్రాంతీయ వైద్యశాల, రెవెన్యూ, జిల్లా సంక్షేమ శాఖ, సఖీ, మున్సిపల్, డీఆర్‌డీవో, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, శ్రీసెస్‌శ్రీ, జెడ్పీ, డీపీఆర్వో, మిషన్ భగీరథ, పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్ ఆఫీస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జేఎన్టీయూ, మైనింగ్, సంక్షేమ హాస్టళ్లు వంటి ప్రభుత్వ సంస్థల్లో ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కనీస వేతన చట్టం ప్రకారం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి రూ.18వేలు ఇవ్వాల్సి ఉండగా.. ఆయా ప్రభుత్వ శాఖలను బట్టి రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఇస్తూ.. మిగతా సొమ్మును సదరు ఏజెన్సీ నిర్వాహకులు నొక్కేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ఆయా సంస్థలకు రెగ్యులర్‌గా వేతనాలు చెల్లిస్తున్నా ఉద్యోగులకు సరిగ్గా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా గట్టిగా నిలదీసి అడిగితే ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారు. తక్కువ వేతనంతోనే వెట్టిచాకిరీ చేస్తున్నా ఉద్యోగ భద్రత కరువైంది.
ఆధార్‌కార్డుతో అనుసంధానం
ప్రభుత్వ ఉద్యోగులకు ఐడీకార్డు, సర్వీసు బుక్కు, సబ్‌ట్రెజరీ ఆఫీస్‌ల్లో రికార్డులు ఉంటాయి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తాజాగా ఆధార్‌కార్డులతో అనుసంధానం చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాల కోసం బిల్లులను 25వ తేదీలోగా సబ్‌ట్రెజరీలకు పంపిస్తారు. కానీ ప్రభుత్వం ఆధార్‌కార్డు జిరాక్స్‌తో సహా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేయడంతో ఆయా ఏజెన్సీలు ఆధార్‌కార్డుల సేకరణలో పడ్డాయి. సకాలంలో ఇవ్వకుంటే.. నవంబరులో వేతనాలు రావని చెబుతున్నారు. ఇంతకాలం బోగస్ ఉద్యోగుల పేరిట వేతనాలు పొందిన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల్లో గుబులు పుట్టింది. జిల్లా వ్యాప్తంగా 2 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు
ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెళ్లికాక ముందు పుట్టింటి పేరు, తండ్రి పేర్లు ఉన్నాయి. పెళ్లయిన తర్వాత భర్త పేరు, అత్తారింటి పేరు నమోదు కావాల్సి ఉంది. ఆధార్‌కార్డుల్లో అప్‌డేట్ కాకపోవడంతో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్‌లైన్‌లో పెళ్లికి ముందు వివరాలను నమోదు చేస్తే.. పెళ్లి తరువాత వివరాలతో ఉద్యోగంలో నమోదై ఉంటే.. ఆన్‌లైన్ తీసుకోవడం లేదు. కానీ ఏ ఆధార్‌కార్డు ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని, ఆ తరువాత ఆధార్‌ను అప్‌డేట్ చేసుకొని ఇవ్వాలని ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆధార్‌కార్డులను సమర్పిస్తున్నారు.


