లక్కెవరిదో?
● దుకాణదారుల్లో టెన్షన్ ● 48 దుకాణాలకు 1,381 దరఖాస్తులు ● నేడు కలెక్టరేట్ ఆవరణలో డ్రా
సిరిసిల్ల క్రైం: మద్యం వ్యాపారుల అదృష్టం నేడు తేలిపోనుంది. ఇన్నాళ్లుగా ఉన్న టెన్షన్‌కు తెరపడనుంది. మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి షాపుల లాటరీ డ్రా సోమవారం ఉదయం నిర్వహించనున్నారు. జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు 1,381 దరఖాస్తులు వచ్చాయి. ఎవరిని అదృష్టం వరించనుందో సోమవారం ఉదయం తేలనుంది.
పెరిగిన ఆదాయం
ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం రూ.3లక్షలు ఫీజుగా నిర్ణయించడంతో మొదటి గడువు 18వ తేదీ నాటికి అనుకున్నంత ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరలేదు. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23వ తేదీ వరకు పొడగించింది. 1,381 దరఖా స్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.41.43కోట్లు చేరింది. దీంతో గతం కంటే కోటి రూపాయలకు పైగా ఆదాయం ఎక్కువగా వచ్చింది. గతం కంటే తక్కువ దరఖాస్తులే వచ్చినా ఆదాయం మాత్రం పెరిగింది.
అత్యధికంగా 11వ నంబర్‌కు 53 దరఖాస్తులు
జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు 1,381 దరఖాస్తులు రాగా అత్యధికంగా సిరిసిల్లలో 11వ నంబర్ షాప్‌నకు 53 దరఖాస్తులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో ఎల్లారెడ్డిపేటలోని 35వ నంబర్ షాపునకు 49, ఎల్లారెడ్డిపేటలోని 41వ నంబర్‌కు 48, సిరిసిల్లలోని 15వ నంబర్ (గౌడ్) షాప్‌నకు 46, సిరిసిల్లలోని 6వ నంబర్‌కు 42 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా వేములవాడలోని 30వ నంబర్ దుకాణానికి 15 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు వివరించారు.
నేడు డ్రా
మద్యం దుకాణాలకు సోమవారం కలెక్టరేట్‌లో లక్కీ డ్రా తీయనున్నారు. ఉదయం 9 గంటలకు దరఖాస్తుదారులు ప్రాంగణానికి చేరుకోవాలని, డ్రా కార్యక్రమం 10 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులెవరూ తమ మొబైల్ ఫోన్లను హాల్‌లోకి తీసుకురావద్దని స్పష్టం చేశారు. లక్కీడ్రాలో షాపు దక్కించుకున్న వారు మొదటి వాయిదా డబ్బులు రూ.10లక్షలు ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించి, డీపీఈవో ఆఫీస్ నుంచి నిర్ధారణపత్రం పొందాలని సూచించారు.


