దర్శనమేలా ?
మా నీటిలో వరదవెల్లి గుట్టపై ఆలయం బోటుకు అనుమతులు లేవు.. అప్రోచ్ రోడ్డుకు నిధులు కరువు పట్టించుకోని పర్యాటక శాఖ
దత్తాత్రేయ..
ప్రస్తుతం గట్టుపైన ఉన్న బోటు
అలంకరణలో రాహు శయన దత్తుడు
బోయినపల్లి(చొప్పదండి): దత్తాత్రేయస్వామిని దర్శించుకునేందుకు బోటు వచ్చిందనే సంతోషం భక్తులకు దూరమైంది. గతంలో మంత్రి ఇచ్చిన హామీతో అప్రోచ్‌రోడ్డు పూర్తవుతుందనే ఆనందం ఆవిరైంది. మంత్రి హామీ నెరవేరకపోగా.. భక్తులకు రెండు నెలలుగా దత్తాత్రేయస్వామి దర్శనం కరువైంది.
మధ్యమా‘నీటి’లో..
బోయినపల్లి మండలం మధ్యమానేరు నీటిలోని వరదవెల్లిగుట్టపై దత్తాత్రేయస్వామి వారు స్వయంభుగా వెలిశారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 27 టీఎంసీల నీరు ఉండడంతో గుట్ట చుట్టూ నీరు చేరింది. ఈక్రమంలో ఆలయానికి భక్తులు వెళ్లలేకపోతున్నారు. నీళ్లు ఉన్నప్పుడు ఆలయానికి చేరుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ గతంలో ఒక బోటును సమకూర్చారు. బోటుకు పర్యాటకశాఖ అనుమతులు, డ్రైవర్ లేకపోవడంతో వృథాగా ఉంటుంది.
డిసెంబర్‌లో జయంతి ఉత్సవాలు
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్‌లో దత్తాత్రేయస్వామి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. టూరిజం సమకూర్చిన బోటు ద్వారా జయంతి ఉత్సవాల సమయంలో ఆలయానికి వెళ్లేవారు. ఆ సమయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. మిగతా రోజుల్లోనూ వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక హోమాలు చేస్తారు. ఆలయం చుట్టూ నీరు లేనప్పుడు ప్రతీ పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు గిరిప్రదక్షిన చేసేవారు.
అప్రోచ్ రోడ్డుకు
రూ.8.80 కోట్లతో ప్రతిపాదనలు
గతంలో జయంతి ఉత్సవాలకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోటులో వచ్చారు. స్థానిక నాయకుల విన్నపంతో రోడ్డు నిర్మాణానికి సర్వే చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు సర్వే పూర్తి చేశారు. డిజైన్ కోసం సీఈ సీడీవో కార్యాలయానికి పంపారు. అనంతరం రూ.8.80 కోట్లతో అప్రోచ్‌రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. అలాగే బోటుకు డ్రైవర్‌ను ఇవ్వాలని టూరిజం ఎండీకి లేఖ రాశారు. కానీ ఇప్పటికీ ఏ ఒక్క పని మొదలుకాలేదు.
నిత్య పూజలకు బ్రేక్
గుట్ట చుట్టూ భారీగా నీరు చేరడంతో ఆలయంలోకి వెళ్లడం లేదు. దీంతో నిత్యపూజలు నిలిచిపోయాయి. ఎండాకాలంలో ఏడు టీఎంసీల నీరు ఉన్నప్పుడు అర్చకులు ప్రతీ రోజు నిత్య పూజలు, గిరిప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టులో నిండుగా నీరు చేరడంతో దత్తాత్రేయస్వామి దర్శనానికి దారి కరువైంది.
మంత్రి, ఎమ్మెల్యేలకు విన్నవించాం
దత్తాత్రేయ ఆలయానికి వెళ్లేందుకు శాశ్వత పరిష్కారంగా రోడ్డు నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలకు గత ఉత్సవాల్లో విన్నవించాం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు సర్వే చేశారు. రూ.8.80 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని ఆశిస్తున్నాం. – కూస రవీందర్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు
దర్శనమేలా ?


