
ఆలయాన్ని పరిశీలిస్తున్న ఈఈ, ఆగయ్య
● టీటీడీ ఈఈ నరసింహమూర్తి ● శ్రీవేణుగోపాలస్వామి ఆలయం పరిశీలన
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో పురాతన ఆలయాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చిందని, ఈ ప్రాంత ప్రజల సహకారంతో శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరిస్తామని టీటీడీ ఈఈ నరసింహమూర్తి పేర్కొన్నారు. జిల్లాలోని సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, ఎల్లారెడ్డిపేటలోని సుప్రసిద్ధ శ్రీవేణుగోపాలస్వామి ఆలయాలను శుక్రవారం పరిశీలించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఇప్పటికే వేణుగోపాలస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఈనేపథ్యంలోనే ఆలయ అభివృద్ధికి టీటీడీ ముందుకురావడం జరిగింది. ఈఈ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో కొన్ని ఆలయాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఆగయ్య మాట్లాడుతూ జిల్లాలో ఆలయాల అభివృద్ధికి టీటీడీ ముందుకురావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.