
బాండ్ అందిస్తున్న గల్ఫ్ మిత్రులు
కోనరావుపేట(వేములవాడ): తల్లీతండ్రి మృతి చెందడంతో అనాథగా మారిన ఓ చిన్నారికి గల్ఫ్ మిత్రులు ఆర్థిక చేయూతనందించారు. కోనరావుపేటకు చెందిన బండి ప్రశాంత్–నవీన దంపతలుకు కూతురు శ్రేష్ట(ఏడాది) ఉంది. అనారోగ్యానికి గురైన ప్రశాంత్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య నవీన మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు శ్రేష్ట అనాథగా మారింది. ప్రస్తుతం అమ్మమ్మ వద్ద ఉంటోంది. విషయం తెలుసుకున్న గల్ఫ్‌మిత్రులు దుబాయ్, మస్కట్, కువైట్, సౌదీ, బహ్రెయిన్, ఖతార్‌లో ఉంటున్న మిత్రులు రూ.55వేలు విరాళాలుగా జమచేశారు. గ్రామంలో ఉంటున్న బొల్లె ప్రశాంత్, దూర్ల రాజేశం, మాందాల ప్రశాంత్‌కు పంపించారు. శుక్రవారం చిన్నారి పేరిట బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి బాండ్‌పేపర్‌ను అందజేశారు.
దాడి కేసులో ఇద్దరి రిమాండ్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ఈనెల 3న ఇంటిపైకి వచ్చి దాడి చేసిన ఘటనలో ఇద్దరిని రిమాండ్ చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఆకుబత్తిని వెంకటసాయి, గాంధీనగర్‌కు చెందిన మ్యాన పావని ఈనెల 9న ప్రేమపెళ్లి చేసుకున్నారు. అనంతరం వెంకటసాయి బావ అయిన జిల్లెల్లకు చెందిన శ్రీరామ్ శ్రీకాంత్ ఇంటికొచ్చారు. ప్రేమపెళ్లి నచ్చని పావని తరఫు వారు జిల్లెల్లకు వచ్చి వెంకటసాయిని, అడ్డుగా వచ్చిన వారిపై దాడిచేశారు. దాడికి పాల్పడిన వారిలో శ్యాంప్రసాద్, టాకార్ రిశ్వంత్‌ను పట్టుకుని రిమాండ్ చేసినట్లు ఎస్సై వివరించారు.
వృద్ధుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెకు చెందిన గుర్రం చంద్రయ్య(70) గురువారం అర్ధరాత్రి ఇంటి ముందు ఉన్న ఇనుప పైపుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. చంద్రయ్య భార్య రెండేళ్ల క్రితం, కొడుకు ఏడాది క్రితం మరణించారు. అప్పటి నుంచి మనస్థాపంతో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న చంద్రయ్య శుక్రవారం ఉదయం చూసేసరికి ఉరివేసుకుని కనిపించాడు. మృతుడి మనవడు ప్రశాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి పోలీసులు తెలిపారు.
చెట్టుపై నుంచి పడి గొర్లకాపరికి గాయాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని అంకుషాపూర్‌కు చెందిన గొర్ల కాపరి జగ్గని రాజేశంయాదవ్ శుక్రవారం చెట్టుపై నుంచి పడి గాయపడ్డాడు. ప్రతి రోజు మాదిరిగానే గొర్లను మేపేందుకు తీసుకెళ్లిన రాజేశం గొర్ల మేత కోసం చెట్టు ఎక్కి కొమ్మలు కొట్టి దిగుతుండగా పట్టుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ రాజేశంను సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.