
విద్యార్థినుల దరిచేరిన శుద్ధ జలం
● రూ.94.98 లక్షలతో 31 పనులు ● శుద్ధ జలం.. స్నానాలకు వేడి నీరు ● మంత్రి కేటీఆర్ చొరవతో వసతులు చేరువ
సిరిసిల్ల: జిల్లాలోని గురుకుల విద్యాలయాలు, కేజీబీవీ, మోడల్‌స్కూల్స్, ఏకలవ్య గురుకులం, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, నర్సింగ్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు(డీఎంఎఫ్‌టీ) నిధులు రూ.94.98 లక్షలతో 31 విద్యాలయాల్లో శుద్ధనీటి(ఫిల్టర్ వాటర్) వసతి, స్నానాలకు వేడి నీళ్ల సౌకర్యం కల్పించారు. గురుకులాల్లో, హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిషన్ భగీరథ నీటి సరఫరా, కొత్త మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు, ఇది వరకే ఉన్న మినరల్ వాటర్‌ప్లాంట్లకు రిపేర్లు, సెప్టిక్ ట్యాంక్ ఔట్‌లెట్, టాయిలెట్ బ్లాక్‌లలో మరమ్మతు పనులు గుర్తించి చేపట్టారు. రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆదేశాలతో కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ పనులు మంజూరు చేశారు. రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) కార్యనిర్వాహక ఇంజినీర్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 16 పనులు పూర్తి చేశారు. మరో 15 పనులు ప్రగతిలో ఉన్నాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాలో పనుల ప్రగతిని సమీక్షిస్తూ.. వేగంగా పనులు చేయిస్తున్నారు.