వెన్నుపోటులో దిట్ట చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటులో దిట్ట చంద్రబాబు

Jun 3 2026 1:33 AM | Updated on Jun 3 2026 1:33 AM

వెన్నుపోటులో దిట్ట చంద్రబాబు

నాడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు నేడు ఓట్లేసి గెలిపించిన ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడు మహిళలకు నెలకు రూ.1500 పథకం అటకెక్కింది నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పాడు నిరుద్యోగ భృతి ఊసేలేదు ఆర్టీసీ డిపోలను ప్రైవేటుపరం చేస్తూ ఉచిత బస్సు పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి ధ్వజం 4వ తేదీ నుంచి మండల కేంద్రాల్లో వైఎస్సార్‌ సీపీ నిరసనలు

ఒంగోలు టౌన్‌: నాడు పిల్లనిచ్చి పెళ్లి చేసిన తండ్రిలాంటి మామను వెన్నుపోటు పొడిచి నేడు ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలను రెండేళ్లుగా మాయమాటలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడని, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్టని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జెడ్పీ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంటు పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌లతో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందరర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న పథకాలన్నిటినీ కొనసాగిస్తామని, ఇంకా అదనంగా కొత్త పథకాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు రూ.1500 అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేలోపు ప్రతి ఒక్కరికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టారన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఏడాది ఆలస్యంగా ప్రారంభించిన చంద్రబాబు ఏడాది తిరక్కుండానే ఆర్టీసీ డిపోలను ప్రైవేటుపరం చేయడం ద్వారా ఉచిత బస్సు పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. సంవత్సరానికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడని, మొదటి సంవత్సరం మొండిచేయి చూపి, రెండో సంవత్సరం అరకొరగా ఇచ్చారని, మూడో సంవత్సరం అసలు ఆ పథకం అమలవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని, ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని తెలిపారు. జగనన్న పాలనలో రైతన్నలకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులే ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని, ఇది రైతులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అతలాకుతం చేసిన మోంథా తుఫానుకు లక్షల ఎకరాల పంట దెబ్బతిందని, ఇప్పటి వరకు వారికి నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కనీసం సబ్సిడీలు కూడా అందించలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు కోట్లాది రూపాయల బకాయిలు ఉంటే వాటిని ఇవ్వకుండా ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో హాస్పిటల్‌ యాజమాన్యాలను వేధిస్తున్నారని తెలిపారు. జగనన్న హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయిందని ప్రచారం చేసుకుంటూ డ్యాన్సులు వేస్తున్న కూటమి పాలకులను చూసి ప్రజలు విస్తుపోతున్నారని, చంద్రబాబు మాయ మాటలు నమ్మి ఓట్లువేసి మోసపోయామని ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారని, సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకొచ్చిన జగనన్న పరిపాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

4వ తేదీ నుంచి నిరసనలు..

చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ఈ నెల 4వతేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బూచేపల్లి వెల్లడించారు. 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, చంద్రబాబు మోసాన్ని ఎండగట్టడం కోసం, కూటమి పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా 12వ తేదీన నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వివరించారు. నిరసన కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వైఎస్‌ విగ్రహాల ధ్వంసం పైశాచికం...

కూటమి పాలనలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని బూచేపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న పాలనలో ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 715 హత్యలు జరిగాయని, అందులో అత్యధికంగా రాజకీయ హత్యలేనని చెప్పారు. మహిళల మీద అత్యాచారాలు, దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బొట్లా రామారావు, వైవీ వెంకటేశ్వర్లు, కేవీ రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, యరజర్ల రమేష్‌, దేవరపల్లి అంజిరెడ్డి, భూమిరెడ్డి రవణమ్మ, దుపా చెంచిరెడ్డి, షేక్‌ మీరావలి, నాగమల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement