కోల్డ్‌ స్టోరేజీకి అష్ట కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

కోల్డ్‌ స్టోరేజీకి అష్ట కష్టాలు!

Jun 3 2026 1:33 AM | Updated on Jun 3 2026 1:33 AM

8 ఏళ్లుగా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణంలో జాప్యం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ధరలు పతనం అవస్థలు పడుతున్న మిర్చి, కంది, శనగ రైతులు టీడీపీ ప్రభుత్వంలో ఆర్భాటంగా కోల్డు స్టోరేజీకి శ్రీకారం 2019 ఎన్నికల ముందు లోకేష్‌ శంకుస్థాపన షో నిధులివ్వకపోవడంతో ఎన్నికల ముందే నిలిచిన నిర్మాణం నేటికీ పిల్లర్‌ దశను దాటని వైనం

మార్కాపురం టౌన్‌: జిల్లా వ్యాప్తంగా ఏటా ఖరీఫ్‌లో 1,52,190 మంది రైతులు 86,349 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు వాణిజ్య పంటలో ప్రధానమైన మిర్చిని 27,077 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అలాగే పొగాకు, కంది, శనగ, సజ్జ, మొక్కజొన్న పంటలు సైతం పండిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిర్చి, పొగాకు, కంది, శనగ పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దళారులు చెప్పిన రేటుకే తెగనమ్ముకుని ఆర్థికంగా కుదేలైపోయారు. మిర్చి రైతులు మాత్రం ఆర్థిక ఇబ్బందులైనా గుంటూరుకు వెళ్లి అక్కడ ప్రైవేటు కోల్డు స్టోరేజీల్లో నిల్వ ఉంచుకుంటున్నారు.

అడుగుముందు పడని నిర్మాణం

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్కాపురం మార్కెట్‌ యార్డులో నాటి పంచాయతీరాజ్‌, ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న నారాలోకేష్‌ 2018 నవంబరు 29వ తేదీన కోల్డు స్టోరేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. హడావుడిగా పనులు ప్రారంభించారు. 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంలో శీతల గిడ్డంగి (కోల్డ్‌ స్టోరేజీ) నిర్మాణం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఎఫ్‌) నిధులు రూ.5 కోట్లు మంజూరు చేసింది. మొక్కబడిగా నిధులు ఇవ్వడంతో కాంట్రాక్టర్‌ పిల్లర్లు వేసి నిలిపేశాడు. 2019 ఎన్నికల ముందే పనులు నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా శీతల గిడ్డంగి విషయాన్ని పట్టించుకోలేదు. ఈ ప్రాంత రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం కోల్డు స్టోరేజీ లేకపోవడంతో ప్రైవేటు కోల్డు స్టోరేజీలను ఆశ్రయించడం లేక దళారులు చెప్పిన ధరకు అమ్ముకోవడమో జరుగుతోంది.

మిర్చి రైతులకు ఎంతో మేలు

జిల్లాలో 27,077 ఎకరాల్లో మిర్చి సాగవుతుంది. అత్యధికంగా మార్కాపురం, తర్లుపాడు, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల్లో మిర్చిని పండిస్తున్నారు. ఇక్కడే కోల్డు స్టోరేజీల్లో అందుబాటులోకి వస్తే మంచి ధర వచ్చిన తరువాత అమ్ముకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి ధరలు నేలచూపు చూస్తున్నాయి. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా కుదేలయ్యారు. మార్కాపురం మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నా కూటమి ప్రభుత్వం వైపు నుంచి స్పందనలేదు. ఇటు కోల్డుస్టోరేజీ లేకపోవడం, అటు మిర్చి కొనుగోలు కేంద్రం రాకపోవడంతో మిర్చి, పప్పుశనగ, కందులు సాగుచేస్తున్న రైతులు తమ ఉత్పత్తులను పొలాల్లో, ఇళ్లల్లో నిల్వ ఉంచుకోలేక తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌ యార్డులో అసంపూర్తిగా ఉన్న కోల్డుస్టోరేజీ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో జిల్లా రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement