● ఉమ్మడి జిల్లాలో భిన్న వాతావరణం ● 22 మండలాల్లో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతల నమోదు ● సాయంత్రానికి పలుచోట్ల వర్షం
ఒంగోలు టౌన్:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వారం రోజుల నుంచి విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే వేడి మొదలై మధ్యాహ్నంకల్లా ఎండ ప్రచండ రూపం దాలుస్తోంది. తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి మొదలుకొని రాత్రి వరకు భయంకరమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో జనాలు పగలంతా ఎండతో, రాత్రయితే ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భయం భయంగా గడుపుతున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. అద్దంకి, బల్లికురవలో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బేస్తవారిపేట, కంభం, చీమకుర్తి మండలాల్లో 43.3 డిగ్రీలు, జె.పంగులూరులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మద్దిపాడు, పెద్దారవీడులో 42.8 డిగ్రీలు, ముండ్లమూరు, నాగులుప్పలపాడు, తాళ్లూరు, త్రిపురాంతకంలో 42.6 డిగ్రీలు నమోదైంది. ఒంగోలు, సంతనూతలపాడు, రాచర్లలో 42.5 డిగ్రీలు, హనుమంతునిపాడు, పామూరు, కురిచేడులో 42.4 నమోదు కాగా, పుల్లల చెరువు, కొనకనమిట్లలో 42.3, ఉలవపాడులో 42.2, టంగుటూరులో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


