● అవయవదానం చేసిన లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు కలెక్టర్ రాజాబాబు సత్కారం
ఒంగోలు సబర్బన్: అవయవదానం ఎంతో గొప్పదని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. కొమ్మూరి లక్ష్మయ్య అనే వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపిన అతని భార్య, కుటుంబ సభ్యులను శనివారం ప్రకాశం భవనంలోని తన కార్యాలయంలో కలెక్టర్ సత్కరించారు. జిల్లాలోనే తొలిసారిగా ఈ అవయవాలను సమర్థవంతంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన కిమ్స్ వైద్య బృందాన్ని కూడా కలెక్టర్ అభినందించారు. ఒంగోలు నగర శివారులోని ముక్తినూతలపాడు ప్రాంతానికి చెందిన కొమ్మూరి లక్ష్మయ్య (52) ఒంగోలులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి పూర్తిగా విషమించింది. తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ ఆ పేద కుటుంబ సభ్యులు పెద్దమనసు చూపారు. లక్ష్మయ్య అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో కిమ్స్ వైద్యులు అతని కాలేయం, కిడ్నీలు, కళ్లను తీసి ఇతరులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నారు. ఒక కిడ్నీని అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి విజయవంతంగా అమర్చారు. మరో కిడ్నీని గుంటూరు రమేష్ ఆస్పత్రికి, కళ్లను ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి పంపారు. డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు ద్వారా ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్.. లక్ష్మయ్య భార్య నాగదేవి, కుమారుడు షాలోమ్ రాజవర్దన్, కూతుళ్లు, అల్లుళ్లను తన చాంబర్‌కు పిలిపించి సత్కరించారు. లక్ష్మయ్య అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారంటూ ప్రశంసించి జీవనదాన్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. లక్ష్మయ్య భార్యకు ఒంగోలు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలుగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లక్ష్మయ్య వైద్య ఖర్చులకు అయిన రూ.70 వేలను ఆ కుటుంబానికి చెక్ రూపంలో కిమ్స్ వైద్యులు తిరిగిచ్చేశారు. లక్ష్మయ్య కుమారుడు ప్రస్తుతం ఐటీఐ రెండో సంవత్సరం చదువుతున్నాడని, కోర్సు పూర్తికాగానే తమ వద్దే ఉద్యోగం ఇస్తామని కూడా వైద్యులు తెలిపారు. తమ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందేలా చూస్తామని వారు ప్రకటించారు. దాత కుటుంబానికి అండగా నిలిచి అవయవదానాన్ని ప్రోత్సహించిన కిమ్స్ వైద్య బృందాన్ని కూడా కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, కిమ్స్ సీఓఓ అంకిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ శ్రీహరిరెడ్డి, వైద్యులు రమేష్ బాబు, రమణారెడ్డి, రామకృష్ణ, జగదీష్, బాలమురళి, అనిల్ కుమార్ పాల్గొన్నారు.


