● విషాదంలో చిన జమ్ములమడక కాలనీ
బల్లికురవ: ఆడుతూ, అల్లరి చేస్తూ, ముద్దులొలికే మాటలతో సందడి చేస్తున్న చిన్నారిని మృత్యువు టిప్పర్ రూపంలో కబళించింది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం పంచాయతీ చిన జమ్ములమడక కాలనీ వద్ద చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. చిన జమ్ములమడక కాలనీకి చెందిన పరిమి ఏసు, శిరీషా దంపతుల రెండో కుమారుడు పెరిడిపాల్(3) ఇంట్లో నుంచి ఆడుకుంటూ రోడ్డు పైకి వచ్చాడు. వెలమవారిపాలెం నుంచి గుండ్లకమ్మ నది వైపు అతివేగంగా వెళ్తున్న టిప్పర్ చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటన తర్వాత ఆగకుండా వేగంగా వెళ్తున్న టిప్పర్‌ను స్థానికులు వెంబడించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.నాగరాజు తెలిపారు. కాగా, స్నేహ సంస్థకు చెందిన టిప్పర్లు రోజూ కొప్పరపాడు వైపు నుంచి, కూకట్లపల్లి రోడ్డు నుంచి గుండ్లకమ్మ నది వైపు ఇసుక, గ్రావెల్ తెచ్చేందుకు అతివేగంగా వెళ్తూ ప్రజల ప్రాణాలలను బలితీసుకుంటున్నాయని వెలమవారిపాలెం, కొత్తూరు, అరుణగిరి, జమ్ములమడక కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.


